మోడీ, అమిత్‌ షా మాటలు నమ్మేదెలా?

May 6,2024 01:50 #Amit Shah, #modi, #Polavaram Project
  • పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, రాజధాని హామీలు ఏమయ్యాయి
  • పదేళ్లపాటు అధికారంలో వుండి చేయనిది ఇపుడు చేస్తారా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘విభజిత రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తాం’ అని2014 ఎన్నికలకు ముందు తిరుపతి బహిరంగ సభలో హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చేసినా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన మోడీ ఇపుడు పదేళ్ల తర్వాత మళ్లీ అదే హామీని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. పదేళ్లపాటు రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం సహకరించని మోడీ ప్రభుత్వం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2024 ఎన్నికల్లో నెగ్గితే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదంటూ అనడం, కేంద్ర హోంశాఖ మంత్రి ఆదివారం ధర్మవరం ఎన్నికల సభలో కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో బాబు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామనడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. విభజన చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పొందుపర్చినా 2014లో అధికారంలోకి రాగానే మోడీ ప్రభుత్వం తిరకాసు వైఖరిని ప్రదర్శించింది. 2020లో గోదావరికి వచ్చిన వరదలకు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. డయాఫ్రం వాల్‌ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో కేంద్రం ఇప్పటిదాకా డిజైన్స్‌ను కూడా ఇవ్వని పరిస్థితి వుంది. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాల పద్దు రూ.56 వేల కోట్లకు ఇప్పటిదాకా కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాసం పేచీ పెట్టడం పెద్ద చర్చనీయాంశమైంది. అయితే మోడీ ప్రభుత్వం పోలవరంలో పునరావాసం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని చెప్పడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కూడా ఇవ్వకుండా కొర్రీలతో నిలిపేస్తున్న పరిస్థితి వుంది. ఇప్పటికీ రూ.12 వేల కోట్లు చేసిన పనులకు బకాయిలను పెట్టింది. ఇలా పోలవరం ప్రాజెక్టును పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిన మోడీ ప్రభుత్వం ఇపుడు రెండేళ్లలో పూర్తి చేస్తామంటే నమ్మేదెట్లా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గోదావరికి వరదలు వచ్చినపుడు నిర్వాసితులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డా కేంద్రం కనికరించని పరిస్థితి. ఈ పదేళ్ల కాలంలో మొదటి నాలుగేళ్లలో ఎన్‌డిఎలో తెలుగుదేశం ప్రభుత్వం వుండగా, ఆ తర్వాత వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో అన్ని బిల్లులకూ మద్దతు ఇచ్చి బిజెపితో సన్నిహిత సంబంధాలనే నడిపింది. ఇలా పదేళ్ల పాటు తమ చెప్పుచేతుల్లో తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు వున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయని మోడీ ప్రభుత్వం ఇపుడు మరోసారి అవకాశం ఇస్తే పూర్తి చేస్తానని చెప్పడం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసపుచ్చడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

➡️