ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చింది ? : వి శ్రీనివాసరావు

  • ఎన్నికల బాండ్ల వివరాలు ఎస్‌బిఐ వెల్లడించాలి
  • 6 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్‌ స్థానాల్లో సిపిఎం పోటీ : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా) : ఎన్నికల బాండ్లు ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో ఎస్‌బిఐ బయటపెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన సిపిఎం గుంటూరు జిల్లా విస్తృత సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎస్‌బిఐ… ఎన్నికల బాండ్లు ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో చెప్పిందేగానీ, ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో వెల్లడించలేదన్నారు. ఎన్నికల బాండ్లు పెద్ద అవినీతి కుంభకోణమని తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. అందులో పెద్ద దొంగ బిజెపి అని వివరించారు. వైసిపికి రూ.337 కోట్లు, టిడిపికి రూ.218 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినట్లుగా చెప్పారని, ఏయే కంపెనీల నుంచి ఎంత వచ్చిందో వివరాలను ఆ రెండు పార్టీలూ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇండియా వేదిక భాగస్వాములతో కమ్యూనిస్టు పార్టీలు అవగాహనతో పోటీ చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే సిపిఎం, సిపిఐకి మధ్య అవగాహన ఉందని, ఇండియా వేదికలోని కాంగ్రెస్‌ పార్టీతో చర్చలు జరుపుతున్నామని, రెండు, మూడు రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయని తెలిపారు. మంగళగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఇండియా వేదికలోని పార్టీలతో చర్చల తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. డబ్బులతో ఓట్లను కొనకుండా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా టిడిపికి, వైసిపికి ఉందా? అని ప్రశ్నించారు. ప్రజల వద్ద విరాళాలు వసూలు చేసి ఎన్నికల్లోకి వెళ్తున్న పార్టీ సిపిఎం మాత్రమేనని తెలిపారు. సిఎఎను సమర్థిస్తూ చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. ముస్లిములకు మాత్రమే పౌరసత్వం ఇవ్వబోమనే సిపిఎను ఆయన ఏ విధంగా సమర్థిస్తున్నారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. లౌకిక పార్టీ అని చెప్పుకునే టిడిపి ఈ విధంగా మాట్లాడడం దారుణమన్నారు. బిజెపికి లొంగిపోయి టిడిపి పొత్తు పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపికి వంత పాడుతున్న టిడిపిలను, వైసిపిని ఓడించాలని కోరారు. ఇండియా వేదికగా పోటీ చేసే పార్టీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. మహిళలను అగౌరపరుస్తూ ట్రోలింగ్‌ చేసే పార్టీలను బహిష్కరించాలని, ఈ సందర్భంగా గీతాంజలి ఆత్మహత్యను ఆయన ప్రస్తావించారు. ఎవరే పార్టీలో ఉన్నా మహిళలను గౌరవించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నాయకులు జొన్న శివశంకరరావు, జెవి రాఘవులు, ఎం రవి, ఎస్‌ఎస్‌ చంగయ్య పాల్గొన్నారు.

➡️