బిజెపి అధికారంలోకొస్తే నాలుగు శాతం రిజర్వేషన్లు మాయం

  • జగన్‌ ప్రతి విషయాన్ని చంద్రబాబుతో ముడిపెట్టడం సరికాదు : షర్మిల

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిములకు నాలుగు శాతం రిజర్వేషన్లను మాయం చేస్తారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను బిజెపికి తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్‌ పార్టీలో తాను చేరానని స్పష్టం చేశారు. కడప నగరంలోని పలు కూడళ్లలో శనివారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌కి ఓటు వేసినా బిజెపికి వేసినట్లేనని తెలిపారు. మోడీ అంటే బాబు, జగన్‌, పవన్‌ అని, మన రాష్ట్రంలో వీళ్ల ముగ్గిరిలో బిజెపి ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి బిల్లుకు జగన్‌, బాబు మద్దతు తెలిపిన వాళ్లేనని పేర్కొన్నారు. కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే ముస్లిములకు భద్రత ఉండదని, వారు ఊపిరి పీల్చుకొనే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా కడప డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు మాటలు వింటున్నాని, చేతులు కలిపానని జగన్‌ మాట్లాడుతున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. జగన్‌ అందం చూసుకుంటే ఆయన మొహం కనపడుతుందా, లేక చంద్రబాబు మొహం కనబడుతుందా అన్నది చెప్పాలని, అందుకే అద్దం పంపిస్తున్నాని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ బిడ్డనైన తాను ఎలాంటి దానినో జగన్‌కు బాగా తెలుసని అన్నారు. తన కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చేందుకు ఒకే ఒక్క ఒక్కసారి చంద్రబాబును కలిశానని వివరించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు చెబితేనే 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానా, ఓదార్పు యాత్ర చేశానా, బై బై బాబు అంటూ క్యాంపెయిన్‌ చేశానా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత కూడా బాబుతో చేతులు కలిపింది అంటూ ప్రచారం చేస్తున్నారని, తండ్రి హత్య కేసులో న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా తిరగని కోర్టు లేదు ఎక్కని మెట్లు లేవని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య కేసు వెనక చంద్రబాబు హస్తం ఉందని చెప్పారని, సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారని, సిఎం అవుతూనే సిబిఐ విచారణ అవసరం లేదని జగన్‌ అన్నారని గుర్తు చేశారు. ఎవరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందన్నారు.

➡️