పవన్‌ బరిలో లేకుంటే నేనే పోటీ చేస్తా- పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

ప్రజాశక్తి – పిఠాపురం (కాకినాడ జిల్లా):జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బరిలో లేకుంటే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఎస్‌విఎస్‌ గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఆదేశం మేరకు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో ఆయన గెలుపునకు శక్తి వంచన లేకుండా సహకరిస్తామన్నారు. ఒకవేళ నియోజకవర్గం నుంచి పవన్‌ పోటీ చేయకుండా వేరే ఎవరైనా పోటీలో నిల్చుంటే మాత్రం కార్యకర్తల అభీష్టం మేరకు తాను కచ్ఛితంగా పోటీలో ఉండి తీరుతానని స్పష్టం చేశారు. పవన్‌ బరిలో లేకుంటే టిడిపి నుంచి తనకే అవకాశం ఇస్తానని చంద్రబాబు తెలిపారన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ప్రస్తుతం మత్స్యకారులు, రైతులు నానా కష్టాలు పడుతున్నారని, వారిని పట్టించుకునే వారే కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. దీనిపై తాను చర్చకు సిద్ధమని తెలిపారు. కష్ట కాలంలో ప్రజలను ఆదుకోని నాయకులు ఎలా ఓట్లను అడుగుతారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు బర్ల అప్పారావు, ఎస్‌ గంగాధర్‌, నల్ల శ్రీను, రాజు బాబు, దేవేంద్రుడు, మాణిక్యం పాల్గొన్నారు.

➡️