ప్రజాస్వామ్య పరిరక్షణకే ఇండియా వేదిక

  •  ఏలూరు రోడ్‌షోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఇండియా వేదిక అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం జిల్లా కేంద్రమైన ఏలూరులోని పవర్‌పేట రైల్వే స్టేషన్‌ నుంచి ఆర్‌ఆర్‌పేట మీదుగా పత్తేబాద రైతుబజార్‌ వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కు సెంటర్‌లో రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మత విశ్వాసాల పట్ల విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. పదేళ్ల బిజెపి పాలనలో ప్రతిపక్షాలు, మేధావులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. బిజెపి మతతత్వ పాలనతో ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ అధికారం కోసం బిజెపి కుట్రలు చేస్తోందని, తనకు అనుకూలంగా లేని పార్టీలపై ఇడితో దాడులు చేయించి అక్రమ అరెస్టులు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.20, రూ.30 కోట్లు ఖర్చు పెట్టే అభ్యర్థులు రంగంలో ఉన్నారని, అలాంటివారు గెలుపొందితే పేదల సమస్యలపై ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. పేదలు, కార్మికులు, రైతుల పక్షాన పోరాడే వారే అసెంబ్లీ, పార్లమెంటులో ఉండాలని అన్నారు. అందుకోసం ఇండియా వేదిక తరపున కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఏలూరు ఎంపి స్థానానికి పోటీ చేస్తున్న కావూరి లావణ్యను, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

➡️