ఇండియా వేదిక గెలుపే దేశానికి రక్ష

May 10,2024 22:45 #sitharam yechuri, #speech

-కార్పొరేట్లకే మోడీ ‘వికసిత్‌ భారత్‌’
-రాజ్యాంగం, లౌకికవాదంపై తీవ్ర దాడి
-మోడీ పాలనలో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
-గుంటూరు ఎన్నికల ప్రచార సభలో సీతారాం ఏచూరి, డి రాజా
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :ఇండియా వేదిక గెలుపే దేశానికి రక్ష అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. కార్పొరేట్ల కోసమే ‘వికసిత్‌ భారత్‌’ నినాదాన్ని మోడీ ఎత్తుకున్నారని విమర్శించారు. నేడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. రాజ్యాంగం, లౌకికవాదంపై తీవ్రమైన దాడి జరుగుతోందని, మోడీ పాలనతో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని తెలిపారు. బిజెపిని, దాని మిత్రులను ఓడించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు సిపిఐ ఎంపి అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, మంగళగిరి సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జన్నా శివశంకరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ గుంటూరులోని కొత్తపేటలో సిపిఐ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో వారు ప్రసంగించారు. సభకు గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందు బిఆర్‌ స్టేడియం నుండి సభాస్థలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గన్నారు. సభలో ఏచూరి మాట్లాడుతూ క్లిష్టపరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ విజ్ఞతతో, దేశభక్తితో బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపితో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ జతకట్టి ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. పార్లమెంటులో బిజెపి ప్రతిపాదించిన అన్ని ప్రజా, రైతు వ్యతిరేక బిల్లులకూ టిడిపి, వైసిపి మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఫాసిస్టు రాజ్యాంగాన్ని తీసుకురావడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలో వంద కోట్ల మంది వద్ద ఎంత సంపద ఉందో అంత సంపద 22 మంది మోడీ మిత్రుల వద్ద ఉందని వివరించారు. విభజన చట్టం అమలు చేయకుండా రాష్ట్రానికి మోడీ తీరని అన్యాయం చేసినా బిజెపితో టిడిపి, వైసిపి, జనసేన అంటకాగుతున్నాయని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో మొదటి మూడు విడతల్లో బిజెపి ఓడిపోతుందని సంకేతాలు రావడంతో మోడీ తన బాణీని మార్చారని, మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గత 70 ఏళ్లలో దేశంలో ఎప్పుడూ లేనంతా నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. దాదాపు 42 శాతం మంది పట్టభద్రులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారన్నారు.
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ బిజెపిని, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను బిజెపి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలిపారు. నరేంద్ర మోడీని ప్రశ్నించలేని స్థితిలో టిడిపి, జనసేన, వైసిపి ఉండడం వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని వివరించారు. బిజెపి హఠావో… దేశ్‌కి బచావో నినాదాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికల్లో అందుకున్నారన్నారు. ఓటమి భయంతో జాతులు, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మోడీ ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ మాట్లాడుతూ సిఎం జగన్‌ గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, ప్రజల ఖాతాలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేసినట్లు చెప్తున్నారని, మిగతా రూ.7.30 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాజీ మంత్రి, రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేసి రైతులకు లబ్ధి చేకూరుస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఇండియా వేదికకు మద్ధతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సిఫార్సులు అమలైతే రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందన్నారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ.గఫూర్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, గుంటూరు తూర్పు అభ్యర్థి షేక్‌ మస్తాన్‌ వలి, కాంగ్రెస్‌ అభ్యర్థులు జాన్‌బాబు (గుంటూరు పశ్చిమ), కొరివి వినరుకుమార్‌ (ప్రత్తిపాడు) తదితరులు పాల్గొన్నారు.

➡️