ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం సామాజిక బాధ్యత

Mar 29,2024 21:44 #Lic, #sadassu

– ఎఐఐఇఎ జాతీయ మాజీ కార్యదర్శి వేణుగోపాల్‌
ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని ఆలిండియా ఇన్సూరెన్సు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) జాతీయ మాజీ కార్యదర్శి కె వేణుగోపాల్‌ అన్నారు. ప్రభుత్వ రంగం ఉంటేనే హక్కులు ఉంటాయని, అందుకోసం అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకొని ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విజయనగరంలోని రెవెన్యూ హోంలో శుక్రవారం ఎల్‌ఐసి బ్రాంచి అసిస్టెంట్‌, యూనియన్‌ నాయకుడు ఎం శ్రీనివాస్‌ ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యత అనే అంశంపై వేణుగోపాల్‌ మాట్లాడుతూ నేడు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న అతిపెద్ద ఇన్సూరెన్స్‌ సంస్థ ఎల్‌ఐసి అని, గుడ్‌ విల్‌ విషయంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ప్రధాని మోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు చనిపోయిన సంస్థలు అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎల్‌ఐసి నుంచి డివిడెండ్‌ రూపంలో రూ.56 వేల కోట్లును మోడీ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఎల్‌ఐసిని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని, దానిని వ్యతిరేకించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేసే విధానాలు అమలు చేస్తున్న బిజెపికి ఓటు వేశామంటే మన మనుగడను మనమే లేకుండా చేసుకున్నవారమవుతామని హెచ్చరించారు.
‘మధ్యతరగతి ఉద్యోగులుా కర్తవ్యాలు’ అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ మధ్యతరగతి ఉద్యోగులు మెరుగైన సమాజం కోసం ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఉద్యోగాలు చేసి రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు పొందుతున్నామని, నేడు బిజెపి పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️