సిపిఎస్‌ రద్దును విస్మరించిన జగన్‌

  • వైసిపి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం
  • జగ్గంపేట, శృంగవరపుకోట ప్రజాగళం సభల్లో చంద్రబాబు

ప్రజాశక్తి- యంత్రాంగం : మద్య నిషేధం, సిపిఎస్‌ రద్దు హామీలను ముఖ్యమంత్రి జగన్‌ విస్మరించారని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని దేవిబొమ్మ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ.. వైసిపి అక్రమాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వాటన్నింటికీ అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఒక దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన దుర్మార్గులు వైసిపిలో ఉన్నారని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ పైనా, ఆయన వైవాహిక జీవితంపైనా సిఎం జగన్‌ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత వైసిపి మాఫియాను రాష్ట్రం నుంచి తరిమేద్దామని చెప్పారు. జగన్‌ అరాచక పాలనను దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు గుంటూరుకు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షులు కోవూరి లక్ష్మి తన బొటనవేలిని కోసుకున్నారనే వార్త తమను కలచివేసిందన్నారు. గంజాయి, ఇతర అక్రమాలపై ఆమె ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. వైసిపి రాక్షస పాలనకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వానికి మరో 20 రోజులే సమయం ఉందని, ఆయనకు ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిందని ఎద్దేవా చేశారు. హూదూద్‌ తుపాను కంటే పెద్ద తుపాను రాజకీయ తుపాను అని, ఈ తుపానులో వైసిపి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పారు. కర్నూలులో అబ్దుల్‌ కలాం అనే వ్యక్తి తన కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటే ఈ ప్రభుత్వం ఎంత అరాచకంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంత ప్రజలకు చదువు చెబుతున్న గీతం యూనివర్సిటీ, వైద్యం అందిస్తున్న గీతం ఆస్పత్రిని జెసిబిలు పెట్టి తవ్వించడానికి ఈ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుబడినా విశాఖ పేరే చెబుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో గంజాయిని ప్రోత్సహిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మరోసారి వైసిపి అధికారంలోకి వచ్చిందంటే విశాఖను మరో పులివెందులుగా తయారు చేసి గొడ్డలి సంస్కృతిని విశాఖకు తీసుకువస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఐటి హబ్‌లు లేకపోవడంతో మన పిల్లలు బెంగళూరు, చెన్నైకి వెళ్లిపోతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖనే ఐటి హబ్‌గా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ఎస్‌.కోటను విశాఖ జిల్లాలో కలుపుతానని ప్రకటించారు. విశాఖ ఎంపి అభ్యర్థి శ్రీభరత్‌, ఎస్‌.కోట అభ్యర్థి కోళ్ల లలితకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
చంద్రబాబునాయుడు దంపతులు సోమవారం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను వేదపండితులు వారికి అందజేశారు.

➡️