కుప్పానికి నీళ్లంటూ జగన్‌ అబద్ధాలు : చంద్రబాబు

Feb 27,2024 10:21 #chandrababu, #cm jagan, #coments, #kuppam
  • సాగునీటి రంగంపై చర్చకు రావాలని సవాల్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: కృష్ణా జలాలను 672 కిలోమీటర్ల నుంచి కుప్పానికి తనే తెచ్చానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం అబద్ధాలకు పరాకాష్ట అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు డ్రామాలు చేస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనుల కోసం టిడిపి ప్రభుత్వం రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసి 87 శాతం పనులు పూర్తిచేసిందని తెలిపారు. జగన్‌ కేవలం రూ.30 కోట్లు ఖర్చు చేసి ఐదేళ్లలో 10 శాతం పనులను పూర్తి చేశారని పేర్కొన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి తమ ఐదేళ్ల పాలనలో రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తే, జగన్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. పులివెందులలో నీళ్లివ్వలేక పంటలు ఎండబెట్టి కుప్పంలో నీళ్లంటూ షో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోతే బాధితులను ఆదుకోకుండా కుప్పాన్ని ఉద్దరిస్తావా? అని జగన్‌ను ప్రశ్నించారు. సాగునీటి రంగంలో నాడు-నేడు జరిగిన పనులపై శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ ప్రాజెక్టుపై అయినా చర్చకు తాము సిద్ధమని సవాల్‌ విసిరారు. బాబాయి వివేకా హత్య విషయంలో ఐదేళ్లుగా సమాధానం చెప్పలేని జగన్‌ హత్యా రాజకీయాలపై కుప్పం వెళ్లి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

➡️