జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలి

Mar 11,2024 22:20 #APWJF, #house sites, #Journalist
  • రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జెడికి ఎపిడబ్ల్యుజెఎఫ్‌ వినతి

ప్రజాశక్తి- విజయవాడ : ప్రభుత్వం జారీ చేసిన జిఒను అమలు చేసి జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) నాయకులు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు కమిటీని నియమించాలని, జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకం కొనసాగించాలని కోరారు. విజయవాడలోని ఐ అండ్‌ పిఆర్‌ కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌ కస్తూరిని ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.వెంకట్రావు, జి.ఆంజనేయులు, నగర అధ్యక్ష, కార్యదర్శులు కె.కలిమిశ్రీ, ఎంబి.నాథన్‌ కలిశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జెడిని కోరారు. జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాలను తయారు చేశాయని, ఫిబ్రవరిలో మరో వారం రోజులు అవకాశం కల్పించినందున మరికొంతమంది జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకున్నారని, ఈ నేపథ్యంలో తుది జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జాబితాల్లోని జర్నలిస్టులకు ఆయా మండలాలు, జిల్లా కేంద్రాల్లో ఎంతభూమి అవసరమో అంచనాలు తయారు చేసి అందుబాటులో ఉన్న భూమి వివరాలను సేకరించాలని కోరారు. భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ధర నిర్ణయించాలని, జర్నలిస్టులు ఎంత మొత్తం, ఎప్పటిలోగా చెల్లించాలో కమిటీలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై దాడుల నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి నేతృత్వంలో వెంటనే హైపవర్‌ కమిటీని నియమించాలని, జిల్లాల్లోనూ ఇటువంటి కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వోద్యోగులకు ఎటువంటి రక్షణ ఉంటుందో అటువంటి చట్టబద్ధమైన రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 31వ తేదీతో జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకం గడువు ముగిసిపోతుందని, దాని కొనసాగింపునకు ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జెడి కస్తూరి స్పందిస్తూ ఈ మూడు అంశాలపై ఆర్థిక శాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అక్కడి నుండి క్లియరెన్స్‌ రావాల్సి ఉందన్నారు. కాగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్లకు, ఎస్‌పిలకు ఎపిడబ్ల్యుజెఎఫ్‌ నాయకులు ఈ మేరకు వినతిపత్రాలు అందజేశారు.

➡️