ఎర్రజెండాతోనే పేదలకు న్యాయం.

May 5,2024 18:04 #CPM election campaign, #gunter
  • సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్: పేదలకు అండగా ఎర్ర జెండా ఉంటేనే న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ఉన్న కేబీ భవన్ లో సిఐటియు తాడేపల్లి మండల స్థాయి కార్యకర్తల సమావేశం సిఐటియు తాడేపల్లి మండల నాయకులు దొంత రెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో గత పది సంవత్సరాలుగా మతోన్మాద బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండి దేశ సంపదను దోచుకు తింటుందని అన్నారు. మోడీ అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు చూపించకుండా మోసం చేశారని అన్నారు. ప్రస్తుతం 26 కోట్ల మంది నిరుద్యోగులు గా మారారని అన్నారు. పారిశ్రామిక రంగం నిర్వీర్యం అవడానికి ప్రధాన కారణం మోడీ విధానాలని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పారిశ్రామిక రంగాలను మోడీ అమ్మేందుకు కుట్ర పన్నారని ఆయన ఎద్దేవా చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చడం వలన కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. 78 వేల కోట్ల చెస్ ను కార్మికులకు ఖర్చు పెట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు మళ్లించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమాకు, వైయస్సార్సీపి ప్రభుత్వం వైయస్సార్ బీమాకు భవన నిర్మాణ కార్మికుల డబ్బులే దారి మళ్లించారని ఆయన విమర్శించారు. కానీ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు పూర్తిగా వర్తింప చేయలేదని ఆయన మండిపడ్డారు. కరోనా సమయములో సేవలు అందించిన మున్సిపల్ కార్మికులను ఫస్ట్ వారియర్స్ గా గుర్తించామని చెప్పిన ప్రభుత్వాలు ఒక నెల జీతం అయినా అదనంగా మున్సిపల్ కార్మికులకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అంతేకాకుండా తాను అధికారంలోకి రాగానే నిత్యవసర వస్తువుల ధరలు పెంచబోమని చెప్పిన మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి నిత్యవసర వస్తువుల ధరలను అమాంతంగా రెట్టింపు చేశారని ఆయన అన్నారు. కష్టజీవుల ఆదాయాలు పెంచకుండా, దేశంలో బడా పారిశ్రామికవేత్తలైన అదాని అంబానీ టాటా బిర్లా ఆదాయాలు మాత్రం రెట్టింపు అయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా నిరుద్యోగం, దేశ అభివృద్ధి గురించి మాట్లాడకుండా, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని మార్చివేస్తామని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం చెప్పటం దుర్మార్గమన్నారు. మనుధర్మ శాస్త్రం తీసుకువచ్చేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందన్నారు. అదేవిధంగా బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. మణిపూర్ రాష్ట్రంలో స్త్రీలను వివస్త్రలను చేసి హింసించిన, జరిగిన దాడులపై నోరు విప్పని మోడీ కి పాలించే అధికారం లేదన్నారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ కూటమి వామపక్ష అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే, సమస్యలపై గళం విప్పే ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నోరు విప్పని టిడిపి వైసిపి, పార్టీలు నేడు మోడీ భజన చేస్తూ ఎన్డీఏ కూటమిగా ఏర్పడడం దుర్మార్గమన్నారు. గత పది సంవత్సరాల కిందట గ్యాస్ సిలిండర్ ధర 430 రూపాయలు ఉంటే నేడు 1000 రూపాయలు గ్యాస్ ధర పెరిగిందన్నారు. నరేంద్ర మోడీ తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను కార్మికులు వ్యతిరేకించాలని ఆయన అన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డు నుండి నిధులను సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన వైసిపి, టిడిపి పార్టీలను కార్మికులు వ్యతిరేకించాలన్నారు. చట్టసభలలో వామపక్ష అభ్యర్థులను పంపినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేనీ శివాజీ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగంలోని చట్టాలను మార్పు చేశారని ఆయన విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడంతో రవాణా రంగంపై భారం పడి, మోటార్ రంగం కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. ఈ కార్మిక వ్యతిరేక చట్టాల వలన భవిష్యత్తులో మోటారురంగం కార్మికులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు. మోడీ విధానాలను అనుసరిస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించి వామపక్ష అభ్యర్థులు జొన్న శివశంకరరావు కు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన, గుంటూరు పార్లమెంట్ సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కు కంకి కొడవలి గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసేది ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కావాలంటే వామపక్ష అభ్యర్థులను గెలిపించి, అసెంబ్లీకి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వి నరసింహారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ, సిఐటియు గుంటూరు జిల్లా నాయకులు బి ముత్యాలరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా సిఐటియు నాయకులు ఏ గోపాలరావు, రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు అమ్మిశెట్టి రంగారావు, సిఐటియు తాడేపల్లి మండల నాయకులు కంచర్ల సాంబశివరావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్కే పున్న, పి మరియ బాబు, రఫీ, భాష, ఎస్.కె గన్, వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల నాయకులు బత్తుల సంసోను, డివైఎఫ్ఐ నాయకులు జె రాజ్ కుమార్, పల్లె భార్గవ్, కంచర్ల జేమ్స్, తదితరులు పాల్గొన్నారు.

➡️