పోలీసుల వలయంలో కటారిపాలెం

-ఇళ్లలో సోదాలు -రూ. 22.95 లక్షలు స్వాధీనం
ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా):బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ, కటారివారిపాలెం గ్రామం గురువారం పోలీసు వలయంలోకి వెళ్లింది. ఉదయం 10.30 గంటలకు చీరాల సబ్‌ డివిజన్‌ పోలీస్‌ యంత్రాగం మొత్తం కటారిపాలెంకు చేరుకుంది. గంట వ్యవధిలో 200 మంది సాయుధ బలగాలు రెండు బస్సుల్లో చేరుకున్నాయి. ఒక్కసారిగా అంతమంది పోలీసులను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల సమాచారం మేరకు.. మండలంలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలలో కటారిపాలెం గ్రామం ఒకటి. ఈ గ్రామంలో పెద్దఎత్తున నగదు, మద్యం ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందడంతో చీరాల డిఎస్‌పి బేతపూడి ప్రసాద్‌ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటీ తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అద్దంకి, పర్చూరు నుండి సాయుధ బలగాలను పోలీసులు రప్పించారు. పామంచి నరసింహారావు అనే వ్యక్తి ఇంటిలో ఉన్న రూ.22.95 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఆ డబ్బులు పొలం అమ్మగా వచ్చిన డబ్బులు అని బాధితుడు చెప్పడంతో అందుకు తగిన ఆధారాలను చూపించాలని అధికారులు చెప్పారు. అప్పటివరకు ట్రెజరీకి జమ చేసేందుకు స్క్వాడ్‌ ఆఫీసర్‌ రాజవర్ధన్‌కు నగదును అప్పగించారు. కటారిపాలెంలో అలజడి విషయం తెలుసుకొని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ ఆ గ్రామానికి చేరుకొని గ్రామ పెద్దలతో మాట్లాడారు.
చీరాల డిఎస్‌పి బేతపూడి ప్రసాద్‌పై ఫిర్యాదు
డిఎస్‌పి ప్రసాద్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు పరిమిళ్‌సింగ్‌కు, పోలీస్‌ పరిశీలకులు అయ్యప్పన్‌కు ఆమంచి కఅష్ణమోహన్‌ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల పరిశీలకులు.. విచారించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమంచి కఅష్ణమోహన్‌ మీడియా సమావేశంలో చెప్పారు.

➡️