అడవులను కార్పొరేట్లకు అప్పగించే కుట్రలు

-రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధి సిపిఎంతోనే సాధ్యం : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)ఆదివాసీల విలువైన భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మరలా వారే గెలిస్తే ఆదివాసీలకు తీవ్ర ముప్పు వాటిల్లనుందని తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధి సిపిఎంతోనే సాధ్యమన్నారు. ఇక్కడి నుంచి సిపిఐ, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆదివాసీ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరిచిన సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మంగళవారం రంపచోడవరంలో పార్టీ జిల్లా కార్యదర్శి బప్పెన కిరణ్‌ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపిఎం అభ్యర్థి గెలిస్తే పోలవరం నిర్వాసితుల సమస్యలపై గళం విప్పి పరిష్కరిస్తారన్నారు. అభ్యర్థిని త్వరలో ప్రకటించనున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గం సిపిఎంకు బలమైనదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు సున్నం రాజయ్య, కుంజా బజ్జిలను ఎమ్మెల్యేలుగా, డాక్టర్‌ మిడియం బాబూరావును ఎంపీగా ప్రజలు గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఆ ఒరవడిని పునరావృతం చేయాలని కోరారు. ప్రస్తుత తరుణంలో గిరిజనుల సమస్యలపై గళమెత్తేవారు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరముందన్నారు. ఉపాధి హామీ చట్టం, కొండపోడు పట్టాలు వంటివి సిపిఎం పోరాటాల ఫలితంగానే వచ్చాయని గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో రంపచోడవరం నియోజకవర్గాన్ని టిడిపి, వైసిపి పట్టించుకోలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేశాయని తెలిపారు. పరిహారం, పునరావాసం వంటివి అమలు చేయకుండా ప్రాజెక్టు నిర్మాణంపై మాత్రమే దృృష్టి పెట్టి గిరిజనులు, ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి పారిపోయేలా వ్యవహరించాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను ఎలా కాలరాస్తున్నాయో వివరించారు. అటవీ హక్కుల సవరణ చట్టం తీసుకొచ్చి గిరిజనులను అటవీ ప్రాంతం నుంచి తరిమేసే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. బిజెపి పాలనలో దేశం అన్నింటా వెనుకబడిపోయిందన్నారు. చేసిన అభివృద్ధి లేకపోవడంతో అయోధ్యలో రామాలయం నిర్మించామని చెప్పుకుంటోందని, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలిగానీ పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించడం వల్ల లాభం ఏంటని ప్రశ్నించారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని గుర్తు చేశారు. పోలవరంలో ఏర్పాటు చేసిన సభలో 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తామని, భూమి కోల్పోయిన వారికి భూమి ఇస్తామని హామీ ఇచ్చారని, నేటికీ అవి నెరవేరలేదని తెలిపారు. ప్రజలను మోసగించిన బిజెపి, టిడిపి, వైసిపిలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ ఐదేళ్లలో పార్టీ చేసిన పోరాటాలను వివరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, మంతెన సీతారాం, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.అరుణ్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్‌, ప్రజా సంఘాల నాయకులు సిరిమల్లె రెడ్డి, శాంతిరాజు, పెద్ద సంఖ్యలో సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️