అరాచక పాలనకు ఓటుతో బుద్దిచెబుదాం – సిపిఎం ఇంటింటా ప్రచారం

Apr 29,2024 10:15 #cpm, #pracharam

ప్రజాశక్తి-యంత్రాంగం :సిపిఎం అభ్యర్థులు ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బిజెపి, వైసిపి, టిడిపి అరాచక పాలనను ప్రజలకు వివరించారు. తమను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని తెలిపారు. బిజెపి అరాచక పాలనకు మద్దతు తెలుపుతున్న టిడిపి, జనసేన, వైసిపిలకు ఓటుతో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు.

నెల్లూరు 11వ డివిజన్‌లో అభ్యర్థి మూలం రమేష్‌ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి పాల్గన్నారు. కులం, మతం, జాతి, ప్రాంతం, భాషతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు దక్కాలని మేథావులు రాజ్యాంగాన్ని రూపొందించారని, అలాంటి రాజ్యాంగానికి కేంద్రంలోని బిజెపి సర్కారు తూట్లు పొడుస్తోందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, కార్మిక, కర్షక ప్రయోజనాలు దెబ్బతినేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపిని, దానితో జతకట్టిన టిడిపి, జనసేన, నిరంకుశ వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న మూలం రమేష్‌ను గెలిపించాలని కోరారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి జన్నా శివశంకరరావు విస్త్రుతంగా ప్రచారం చేశారు. నియోజకవర్గంలో ధనవంతులు పోటీ చేస్తున్నారని, వారు గెలిచాక స్థానిక సమస్యలను పట్టించుకోరని హెచ్చరించారు. గత పది సంవత్సరాల నుండి స్థానిక ఎమ్మెల్యే హైలెవెల్‌ ఛానల్‌ సమస్యను పరిష్కరించలేక పోయారని గుర్తు చేశారు. తమను గెలిపిస్తే చిలువురు రైల్వే గేట్‌ వద్ద అండర్‌ గ్రౌండ్‌ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని, బస్సు సౌకర్యం పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో సిపిఎం రాష్ట్ర నాయకులు కె ఉమామహేశ్వరరావు పాల్గన్నారు.

ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ 58వ డివిజన్‌లోని అజిత్‌సింగ్‌ నగర్‌, వడ్డెర కాలనీ, పి అండ్‌ టి కాలనీ, ఇందిరానాయక్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో సెంట్రల్‌ నియోజవర్గం అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి, గతంలో అధికారంలో ఉన్న టిడిపి పార్టీల మేనిఫెస్టోలు, ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. మరోసారి ప్రజలను మోసగించడానికి కొత్త హామీలతో ఈ పార్టీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ఈ పార్టీలు ప్రజలకు సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలంలో గన్నవరం అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని జర్న, గోయిపాక పంచాయతీల్లోనూ, సీతంపేట మండలం పూతికవలస, డొంబంగివలస, సల్బంపాడు, నెల్లిగండి, ఈతమానుగూడ, సావిడివలస, గురండి, పుట్టిగాం గ్రామాల్లోనూ కురుపాం అభ్యర్థి మండంగి రమణ ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

గిరిజన హక్కులను రక్షించుకునేందుకు ఎంపి, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేస్తున్న తమను ఆదరించాలని కోరారు. కర్నూలు నగరంలోని నండూరి ప్రసాదరావునగర్‌, ఫూలే అంబేద్కర్‌ నగర్‌, సమత నగర్‌, ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి నగర్‌, ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయీస్‌ కాలనీలో పాణ్యం అభ్యర్థి డి గౌస్‌ దేశారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గత 15 ఏళ్లుగా పేదలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని తెలిపారు. ఫూలే అంబేద్కర్‌ కాలనీలో రోడ్లు, విద్యుత్‌ దీపాలు, మురుగు కాలువలు ఏర్పాటు చేయలేదన్నారు. పేదలు మురుగు కూపాల మధ్య జీవనం సాగించాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. తనును గెలిపిస్తే పేదలందరికీ సొంత ఇంటిని నిర్మిస్తానని, మౌలిక సదుపాయాలతో కాలనీలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు ప్రచారం చేశారు. రంపచోడవరంలో అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావుల విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రజా నాట్య మండలి కళాకారులు రంపచోడవరం అంబేద్కర్‌ సెంటర్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ సెంటర్‌, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సెంటర్‌, బర్నగూడెం గ్రామాల్లో నృత్యాలు, పాటలతో చేపట్టిన ప్రచారం ఆకట్టుకుంది. అరకులోయ మండలం సుంకరమెట్టలో అప్పలనర్స గెలుపు కోరుతూ జరిగిన ప్రచార కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం పాల్గన్నారు. పాడేరు మండలంలోని వంట్లమామిడి, గుర్రగరువు, ఓనూరు, నందిగరువు, డల్లాపల్లి, తప్పిపుట్టు, సంగోడి గ్రామాల్లో అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స ప్రచారం నిర్వహించారు. విశాఖ తోకాడలోని సమైక్య అపార్ట్‌మెంట్‌లో గాజువాక అభ్యర్థి ఎం.జగ్గునాయుడును గెలిపించాలని కోరుతూ వార్వా, నివాస్‌ సంఘాల ఆధ్వర్యాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

➡️