‘యువగళం’ ఎన్నో పాఠాలు నేర్పింది : లోకేష్‌

Dec 21,2023 08:37 #Nara Lokesh, #yuvagalam padayatra
lokesh speech in yuvagalam

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : తాను చేపట్టిన యువగళం పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో కళ్లారా చూశానన్నారు. జగన్‌ విధ్వంసం ప్రతి అడుగులోనూ కనిపించిందని తెలిపారు. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతోందని, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, తాగునీటి కోసం మహిళలు బిందెలు మోస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రకాశం జిల్లాను ఎడారిగా మార్చారని, ఆ జిల్లాలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని విమర్శించారు. రాజధాని అమరావతిని తొక్కేసిన జగన్‌ రాక్షస ఆనందం చూశానన్నారు. రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత మిషన్‌ రాయలసీమ ప్రకటించానని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ ప్రాంతంలోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, హార్టీకల్చర్‌ హబ్‌గా తయారు చేస్తామని, రాష్ట్రాన్ని దేశానికి క్రీడల రాజధానిగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాజధానితో జగన్‌ మూడు ముక్కలాట ఆడారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క ఇటుక కూడా వెయ్యలేదని విమర్శించారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అయినటువంటి స్టీల్‌ ప్లాంట్‌ ఆస్తులు కొట్టేయడానికి ప్రణాళిక వేశారని ఆరోపించారు. 31 మంది ఎంపిలు ఉన్నా ప్రయివేట్‌కరణ ఆపడానికి అందుకే ప్రయత్నించలేదని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ ఒక్క అడుగూ ముందుకు పడలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే ఈ పనులు ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. విశాఖ మెట్రో ప్రాజెక్టును మూలన పడేశారని విమర్శించారు. జగన్‌ బ్లూ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తారని, రెడ్‌ బటన్‌ నొక్కి తిరిగి ఆ డబ్బులు తీసుకుంటారని వివరించారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌, మూడుసార్లు ఆర్‌టిసి ఛార్జీలు పెంచారని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు జగన్‌ రద్దు చేసిన సంక్షేమ పథకాలను తాము అధికారంలోకొస్తే తిరిగి పునరుద్ధరిస్తామని, ఏటా జాబ్‌ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తాను చేపట్టిన యువగళం, పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి, చంద్రబాబునాయుడు చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలతో జగన్‌కు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు విజనరీ నాయకుడైతే, జగన్‌ ప్రిజనరీ నాయకుడిని పేర్కొన్నారు. సభలో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ లోకేష్‌ యువగళంలో ప్రజాగళం కదంతొక్కిందని అన్నారు. పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించినా విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. వైసిపి అక్రమాలు ఇలాగే కొనసాగితే ప్రపంచపటంలో ఎపి ఉండదని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ‘సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి మనది. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉంది’ అని అన్నారు.

వైసిపికి డిపాజిట్లు రావు : అచ్చెన్నాయుడు

తమ పార్టీతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలవడంతో వైసిపికి చాలా జిల్లాల్లో డిపాజిట్లు కూడా రావని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు అన్నారు. టిడిపి, జనసేన పార్టీ మధ్య విభేదాలు తీసుకురావడానికి జగన్‌ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తన స్వార్థం కోసం కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన ఘనుడు జగన్‌ అని వ్యాఖ్యానించారు. టిడిపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా పని చేయాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలూ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తమ పార్టీలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

యువగళం-నవశకం సభ సైడ్‌లైట్స్‌

  • యువగళం సభా వేదిక వద్దకు బుధవారం ఉదయం నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తల రాక మొదలైంది. టెంట్లు వేయకపోవడంతో ఎండకు ఒకింత ఇబ్బంది పడ్డారు.
  • 11 గంటల నుంచి వేదిక టిడిపి స్థానికేతర నాయకుల కంట్రోల్‌లోకి వెళ్లడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు ఇబ్బంది పడ్డారు. ఇతర జిల్లాల నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారంటూ స్థానిక నాయకుల నోట వినిపించింది. శ్రీ అన్ని జిల్లాల నుంచి టిడిపి నాయకులు, ముఖ్య కార్యకర్తలు తరలి వచ్చారు.
  • జనసేన నాయకులు, కార్యకర్తల హడావుడి ఎక్కువగా కనిపించింది. శ్రీ వేదికపై సుమారు 600 మంది నాయకులు కూర్చున్నారు. మొదటి వరసలో చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, నాదెండ్ల మనోహర్‌ కూర్చున్నారు.
  • టిడిపి చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వేదిక, సభా ప్రాంగణం రూపొందించారని నాయకులు, కార్యకర్తలు చర్చించుకున్నారు.
  • సభ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభం నుంచే జనం బారికేడ్లను తోసుకుంటూ వేదిక ముందు ఉన్న ప్రెస్‌, విఐపి గేలరీ వరకూ దూసుకొచ్చారు.
  • 4.30 గంటలకు లోకేష్‌, 5 గంటలకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ వేదిక వద్దకు వచ్చారు.
  • టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్‌ రాజు ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పితాని సత్యనారాయణ, మైనార్టీ సెల్‌ నాయకులు ఎంఎస్‌, మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తదితరులు మాట్లాడారు.
  • ప్రధాన సభ 5.20 గంటలకు ప్రారంభమైంది. టిడిపి నాయకులు పల్లా శ్రీనివాస్‌, జనసేన నాయకులు పంచకర్ల రమేష్‌ బాబు స్వాగత ఉపన్యాసం చేశారు.
  • సభ మధ్య మధ్యలో యువగళం పాదయాత్ర విశేషాలతో కూడిన వీడియోలు ప్రదర్శించారు.శ్రీ సభకు భారీగా జనం తరలిరావడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.
➡️