MIMS: సిఐటియు నాయకులు తమ్మినేని, టివి రమణ సహా 13 మంది అరెస్టు

MIMS CITU leaders arrested

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :మిమ్స్‌ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలికారు. మిమ్స్‌ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా సిఐటియు ఆధ్వర్యాన ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో యాజమాన్యం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పోలీసులను ఉపయోగించి సిఐటియు నాయకులపై నిర్బంధానికి పాల్పడుతోంది. సోమవారం వేకువజామున సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, టివి రమణ సహా 13 మంది మిమ్స్‌ ఉద్యోగులను వారి ఇళ్ల వద్ద పోలీసులు అరెస్ట్‌ చేసి పూసపాటిరేగ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ సమస్యలపై స్పందించకుండా, మెడికల్‌ కళాశాలను ముట్టడిస్తారంటూ పోలీసులకు యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చి అరెస్టులు చేయించిందన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను అరెస్టులు చేయడం అన్యాయమని, మిమ్స్‌ ఉద్యోగులు వేతన ఒప్పందం చేయాలని, బకాయి ఉన్న డిఎలు చెల్లించాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని, యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు.
మరోవైపు ఆస్పత్రి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరసన 40వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌ మాట్లాడుతూ మిమ్స్‌ యాజమాన్యం మొండి వైఖరితో ఉద్యోగులు, కార్మికులకు జనవరి జీతాలు, డిఎ బకాయిలు ఇవ్వకుండా, వేతన ఒప్పందం చేయకుండా ఇబ్బంది పెడుతోందని అన్నారు.

➡️