కూటమిలో కలవని మనసులు

May 1,2024 03:00
  •  బిజెపితో పొత్తుపై టిడిపి-జనసేన శ్రేణుల్లో అసంతృప్తి
  •  హోదా, పోలవరం, విశాఖ స్టీల్‌పై వైఖరి చెప్పని కమలం
  •  కేంద్రం ద్రోహంపై బాబు, జగన్‌, పవన్‌ మౌనాన్ని ఎండగడుతున్న ‘ఇండియా’

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో జోష్‌లో ఉండాల్సిన టిడిపి-జనసేన పార్టీల శ్రేణులు.. బిజెపితో పొత్తు కారణంగా నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నాయి. ఏదో ఆశించి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పొత్తుపెట్టుకుంటే మేలు జరగకపోగా, పెద్దస్థాయిలో తమకు నష్టం జరుగుతోందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీ, ఇతర ప్రజాస్వామ్య వాదుల మద్దతును పూర్తిగా కోల్పోయినట్లు అంగీకరిస్తున్న ఆ పార్టీల నేతలు, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఎదురుగాలి వీస్తోందని తెలిసి మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఎన్నికలు జరిగిన రెండు దశల్లోనూ ఎన్‌డిఎ కూటమిపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు ట్రెండ్స్‌ తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అధికారపక్షమైన వైసిపి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాలతో టిడిపి-జనసేన-బిజెపి కూటమిని విమర్శిస్తోంది. మరోవైపు రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని ఇండియా బ్లాక్‌ పార్టీలైన కాంగ్రెస్‌, వామపక్షాలు నిలదీస్తున్నాయి. బిజెపి విషయంలో వైసిపి కూడా సైలెన్స్‌ పాటిస్తోందని ఎండగడుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తున్న టిడిపి-జనసేన పార్టీల నాయకులు, శ్రేణులు.. బిజెపితో పొత్తుపెట్టుకుని అనవసరంగా ఇరుక్కుపోయామనే భావనలోకి వచ్చి తీవ్రంగా సతమతమైపోతున్నారు.

మద్దతు కరువు
బిజెపితో పోత్తు పెట్టుకున్నా.. రాష్ట్రంలో తమకు ఎటువంటి ప్రయోజనం కలగటం లేదని పలువురు టిడిపి-జనసేన కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అయితే బిజెపితో పొత్తు మూలంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తూ, రాష్ట్ర సిఎస్‌, డిజిపిలను మార్చాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు టిడిపి-జనసేనతో పాటు రాష్ట్ర బిజెపి నేతలు కూడా అనేక ఫిర్యాదులు చేశారు. కానీ ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ అంత సీరియస్‌గా పరిగణనలోకి తీసుకున్నట్లు కనపించలేదు. అలాగే ఎన్నికల్లో జనసేన సింబల్‌ అయిన గాజు గ్లాసును కామన్‌ సింబల్‌గా పేర్కొంటూ, జనసేన పోటీలేని చోట స్వతంత్రులకు, ఇతర పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసును కేటాయించారు.
గాజు గ్లాసును పోలి ఉండే బకెట్‌, దగ్గర పోలిక ఉండే ఇతర సింబల్స్‌ను ఇండిపెండెంట్‌, రెబల్‌ అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు కేటాయించారు. దీంతో ఒక్కసారిగా టిడిపి-జనసేన శ్రేణులు కంగుతిన్నాయి. కనీసం గాజుగ్లాసు సింబల్‌ను కామన్‌ సింబల్‌గా కేటాయించకుండా ఆపలేకపోయామని.. ఇంకా బిజెపితో పొత్తుపెట్టుకుని ఏం ప్రయోజమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హామీ ఇవ్వని మోడీ…
రాష్ట్రంలో ఇటీవల జరిగిన తొలి ఎన్‌డిఎ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ రాష్ట్రాభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. రాజధాని, పోలవరం, రైల్వేజోన్‌, ఇతర కేంద్ర ప్రాజెక్టులపై కూడా ఆయన ఏమాత్రం స్పందించలేదు. దీంతో టిడిపి-జనసేన శ్రేణులకు బిజెపి వైఖరి ఏంటో కాస్త స్పష్టమైనప్పటికీ, నిదానంగా పరిస్థితులు మారుతాయని భావించారు. ఇప్పటికీ ఎటువంటి మార్పు లేకపోవటంతో ప్రధానంగా టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఓవైపు బలమైన ఓటు బ్యాంకు కోల్పోయి, అధికార పక్షం విమర్శలతో సతమతమై అన్ని అంశాల్లో బిజెపితో పొత్తు వల్ల రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి తయారైందని భావిస్తున్నారు.

➡️