తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీయే..

May 19,2024 21:33 #cpi narayana, #press
  • ఎన్‌డిఎ, వైసిపి ప్రభుత్వాలు మారతాయి
  •  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీయేనని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేసిన ఎన్‌డిఎ, వైసిపి ప్రభుత్వాలు మారడం ఖాయమని తెలిపారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయని తెలిపారు. కేంద్రంలో బిజెపికి 400 సీట్లు వస్తాయని ప్రధాని మోడీ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని అన్నారు. బిజెపికి ముస్లిములు, దళితులు, వెనుకబడిన తరగుతుల వారు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. దేశంలో నల్లధనం వెలికి తీస్తామని మోడీ చెప్పినవన్నీ అబద్దాలేనని, ఈసారి ఎన్నికల్లో రూ.8600 కోట్లు ఎన్నికల అధికారులు పట్టుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ముందనార్‌ పోర్టు నుంచి గంజాయి, డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయన్నారు. అవినీతిని ఎన్ని రకాలుగా చేయవచ్చో జగన్‌మోహన్‌ రెడ్డి వద్ద నేర్చుకోవాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు బతుకు తెరువు రాజకీయాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు డిజిపిని మార్చకపోతే రాష్ట్రం వల్లకాడు అయ్యేదన్నారు. ఎన్నికల తరువాత పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరిగాయన్నారు. ఓటమి దిశగా ఉన్న వైసిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️