మోడీ ఓటమి స్పష్టం

May 9,2024 06:50 #seetharam yechuri, #speech
  • అందుకే అదానీ, అంబానీలను ప్రశ్నిస్తున్నారు
  • తాడేపల్లి, గన్నవరం సభల్లో ఏచూరి
  • బిజెపితో కలవడం టిడిపికి నష్టం
  • జగన్‌ బిజెపికి సహకరిస్తున్నారు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో / కృష్ణా ప్రతినిధి : దేశంలో మోడీ ఓటమి స్పష్టమైందని, అందుకనే ఆయన మిత్రులైన అదానీ, అంబానీలను తిట్టడం మొదలుపెట్టారని, మూడు దశలుగా జరిగిన పోలింగులో మోడీ ప్రభావం పూర్తిగా తగ్గిందనేది తేలిపోయిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాంగ్రెస్‌, సిపిఐ, ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంటు సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, గన్నవరం సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ బుధవారం గన్నవరం, తాడేపల్లిలో జరిగిన సభల్లో ఆయన పాల్గన్నారు. తాడేపల్లిలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, గన్నవరంలో కృష్ణా జిల్లా కార్యదర్శి వై నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. తొలుత ‘నయవంచన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, లౌకిక ప్రజాతంత్ర పునాదులను కాపాడుకోవాలన్నా ఇండియా వేదికలోని పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే ఇండియా వేదిక తప్ప మరొకటి లేదని తెలిపారు. మూడు దశల్లో జరిగిన ఓటింగు సరళి మోడీ, బిజెపిపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అందుకనే అదానీ, అంబానీలను మోడీ తిడుతున్నారని, కాంగ్రెస్‌కు డబ్బులిచ్చారని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. అతని అభద్రతాభావమే ఓటమి ఖాయమైందని తెలిసిపోతుందన్నారు. మోడీని గద్దె దించితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకనే గుంటూరు నుండి పోటీచేస్తున్న సిపిఐ ఎంపి అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, మంగళగిరి నుండి పోటీచేస్తున్న సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జన్నా శివశంకర్‌ను గెలిపించాలని కోరారు. పోలింగు తగ్గడమంటే మోడీ హవా ఏమీ లేదని తెలిసిపోతుందన్నారు. మోడీ హవాలేదని తేలడంతో ప్రచారాన్ని మార్చి హిందూ, ముస్లిముల మధ్య ఘర్షణలు పెంచేవిధంగా మాట్లాడుతున్నారన్నారు. లవ్‌ జిహాద్‌, గోరక్షణ పేరుతో దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్య పునాదులైన నాలుగు స్తంభాలు దెబ్బతిన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మోడీని గద్దె దించితేనే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలమన్నారు. సహజ వనరులను లూఠీ చేశారని, అటవీ ప్రాంతం నుంచి గిరిజనులను తరిమేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారని అన్నారు. దేశంలో ప్రతి గంటకూ మహిళలపై 46 దాడులు జరుగుతున్నాయని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత పెద్దయెత్తున దాడులు జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం న్యాయం చేసిందని బిజెపితో కలిశారో సమాధానం చెప్పాలన్నారు. గతంలో వాజ్‌పేయి కాలంలోనూ ఇలాగే చేసి పదేళ్లపాటు అధికారానికి దూరమయ్యారని, ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందని, బిజెపితో కలవడం టిడిపికి నష్టమని హెచ్చరించారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, ఈసారి రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు స్థానం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ప్రతిపక్షాలను కలవని ఏకైక సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అని, అతను అధికారంలో ఉండటానికి ఏ మాత్రమూ అర్హత లేదని తెలిపారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బిజెపితో కలిశారో ప్రజలకు చెప్పాలని కోరారు. మాజీ ఎంపి పి మధు మాట్లాడుతూ.. దేశం బాగుపడాలంటే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌ అధికారంలోకి రాకూడదని అన్నారు. వీరంతా కలిసి దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని పేర్కొన్నారు.
ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలీ మాట్లాడుతూ.. మోడీ పాలనలో భారత జాతికి ప్రమాదం వచ్చిందని అన్నారు. చంద్రబాబు ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానని చెప్పినా కనీసం ఒక్క భవనం కూడా కట్టలేదని, జగన్‌ అయితే అనవాళ్లు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు పార్లమెంటు అభ్యర్థి జంగాల అజరు, మంగళగిరి సిపిఎం అభ్యర్థి జన్నా శివశంకరరావు, తాడేపల్లి మాజీ సర్పంచ్‌ డి శ్రీనివాసకుమారి, ఆవాజ్‌ రాష్ట్ర నాయకులు చిస్తీ తదితరులు మాట్లాడారు. ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయలేదన్నారు. ఇండియా వేదిక అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఈ సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, వి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వి సంజీవరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గన్నారు.

➡️