వేధింపులకు నిండు కుటుంబం బలి

Apr 30,2024 08:36 #committed suicide, #daughter, #mother, #Son
  • ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
  •  వైఎస్‌ఆర్‌ జిల్లా చెన్నూరులో విషాదం

ప్రజాశక్తి – వల్లూరు : వైఎస్‌ఆర్‌ జిల్లా చెన్నూరులో పెను విషాదం చోటుచేసుకుంది. భర్త ఇంటి వేధింపులను తాళలేక ఒక తల్లి, ఇద్దరు పిల్లలతో సహా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గంగాయపల్లె సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం…చెన్నూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి (45) కడప నగర సమీపంలోని చలమారెడ్డిపల్లికి చెందిన శ్రీహరితో 2005లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఫణికుమార్‌ (18), కుమార్తె ధనలక్ష్మి (17) ఉన్నారు. శ్రీహరి కువైట్‌ వెళ్లడంతో 12 ఏళ్లుగా పిల్లలతో సహా ఆమె చెన్నూరులోని తన సోదరుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లోనే ఉండేవారు. అయితే కొద్దికాలం తర్వాత కువైట్‌ నుంచి భర్త తిరిగిరావడంతో తనను, పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరారు. శ్రీహరి అందుకు నిరాకరించడంతో పాటు విడాకుల నోటీసులు కూడా పంపారు. అయితే ఆమెకు రూ.8 లక్షల మేర భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు శ్రీహరి నిరాకరించి వాదులాటకు దిగారు. ఉమామహేశ్వరిపై దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో ఆమె తిరిగి సోదరుడి ఇంటికే వెళ్లారు. కాగా గత శనివారం పిల్లలతో కలిసి గుడికి వెళ్లొస్తానని ఆమె సోదరుడి ఇంట్లో చెప్పారు. బయటకు వెళ్లిన తర్వాత ‘నేను, పిల్లలూ రైలు కింద పడి చనిపోతున్నాం. మా చావుకు నా భర్త శ్రీహరి, అత్త సరస్వతి, ఆడ పడుచు శశికళ, మరో వ్యక్తి లక్ష్మీపతి కారణం’ అని సోదరుడికి వాయిస్‌ మేసేజ్‌ పంపారు. దీంతో ఆమె సోదరుడు రాజేంద్రప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్‌ సిగల్‌ ఆధారంగా ట్రాకింగ్‌ చేయగా గంగాయపల్లి బోరెడ్డిపల్లి మధ్యలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు గంగాయపల్లె సమీపంలోని ఒక చెట్టుకు ఉమామశ్వేరి, ఆమె పిల్లలు ఊరేసుకొని ఉన్న విషయాన్ని గమనించిన ఆ ప్రాంతానికి చెందిన ఒక పాడి రైతు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో వల్లూరు ఎస్‌ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప డిఎస్‌పి షరీఫ్‌ తెలిపారు.

➡️