దాడులకు బెదరను

  • గుడివాడలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- కృష్ణా, ఏలూరు ప్రతినిధులు : రాయి వేసి దాడి చేసినంత మాత్రాన తాను అదిరేది, బెదిరేది లేదని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విజయవాడ సంఘటన తరువాత వైద్యుల సలహామేరకు ఆదివారం విశ్రాంతి తీసుకున్న ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో సోమవారం నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇలాంటి దాడులతో తన సంకల్పం చెక్కుచెదరదన్నారు. చంద్రబాబు ఈ స్థాయికి దిగజారడమంటే దాని అర్థం విజయానికి తాము చేరువగా ఉన్నట్లేనని, టిడిపి వారు దూరంగా ఉన్నట్లేనని చెప్పారు. ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రజల ఆశీస్సుల వల్ల తన నుదిటిపై పెద్ద గాయాలు కాలేదని, తన గాయం పది రోజుల్లో తగ్గిపోతుందని, కానీ చంద్రబాబు పేదలకు, నిరుద్యోగులకు, రైతులకు, వివిధ సామాజక తరగతులకు చేసిన గాయాలు ఎన్నటికీ మానవని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్‌, పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దన్నదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేయించింది, విభజిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వద్దన్నదీ చంద్రబాబేనని అన్నారు. ఆయనను నమ్మడమంటే చెరువులో చేపలకు కొంగలను కాపాలా పెట్టడమేనని, దొంగ చేతికి తాళాలు ఇవ్వడమేనని అన్నారు. రాష్ట్రంలో నాలుగు సీ పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయని వివరించారు. తాము చేస్తున్న అభివృద్ధి పచ్చ నేతలకు కనిపించడంలేదని విమర్శించారు.

కరెంటు కలకలం…
హనుమాన్‌ జంక్షన్‌ జాతీయ రహదారి మీదుగా ఏలూరు జిల్లాలో అడుగుపెట్టిన సిఎం బస్సు యాత్ర 9.15 గంటలకు ఉంగుటూరు మండలం నారాయణ పురం చేరుకుంది. అక్కడ నాలుగు రోడ్ల కూడలిలో బస్సు ఆగడంతో జగన్‌ బస్సు పైకి ఎక్కి అభివాదం చేస్తుండగా కరెంట్‌ పోయింది. దీంతొ ఒక్కసారిగా కలకలం రేగింది. సిఎం రక్షణ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, వెంటనే కరెంటు వచ్చింది.

సిపిఎం నేతల గృహ నిర్బంధం
గుడివాడ : ముఖ్యమంత్రి గుడివాడ వస్తున్న నేపథ్యంలో సోమవారం పలువురు సిపిఎం నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, గుడివాడ పట్టణ కార్యదర్శి ఆర్‌సిపి రెడ్డి, గుడ్లవల్లేరు మండల కార్యదర్శి బివి శ్రీనివాసరావు, టిడ్కో గృహాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి బి.అరుణల నివాసాలకు తెల్లవారుజామునే చేరుకున్న పోలీసులు వారిని హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో ఈ నిర్బంధం ఏమిటని ప్రశ్నించినా వారు వినలేదు. దీంతో అవసరమైతే తమను అరెస్టు చేసుకోవాలంటూ వారు పట్టణంలోని సిపిఎం కార్యాలయానికి వెళ్లారు. అక్కడకు కూడా వారిని వెంబడించిన పోలీసులు సిపిఎం కారాలయం బైటే తిష్టవేశారు. సాయంత్రం సిఎం సభ ముగిసేంత వరకు ఇదే స్థితి.

➡️