ప్రజలు ప్రత్యామ్నాయంవైపు ఆలోచించాలి

  •  ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక మేనిఫెస్టో ఆవిష్కరణ
  •  ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ

ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : విభజన చట్టాన్ని అమలు చేయకుండా.. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి సహకరించేలా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వ్యవహరించడం దారుణమని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాలని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడ్డవారికే మద్దతునివ్వాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని గిరిజన సంఘం భవనంలో ఉత్తరాంధ్ర అభివద్ధి ప్రణాళిక మేనిఫెస్టోను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపారమైన వనరులున్న ఉత్తరాంధ్ర నేటికీ వెనుకబాటులో ఉండడానికి పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కాకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం విచారకరమన్నారు. ఈ ప్రాంతాన్ని పదేళ్లుగా అభివృద్ధి చేయకుండా పాలకులు అవకాశవాదం ప్రదర్శించారని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయలేదన్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటులోకి నెట్టబడిందని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దారుణమన్నారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో ఉత్తరాంధ్రలో విస్తారంగా ఉన్న అటవీ భూములను కాజేసి.. గిరిజనులను రోడ్లమీద నెట్టేయాలని పాలకులు చూస్తున్నారని తెలిపారు. సముద్రంతోపాటు సహజ వనరులు అన్నింటినీ కార్పొరేట్లపరం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడాల్సిన టిడిపి, జనసేనలు ఆ పని చేయకపోగా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో జతకట్టడం అన్యాయమన్నారు. బిజెపికి సహకరించేలా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ఈ మూడు ప్రధాన పార్టీల అవకాశవాదాన్ని గుర్తెరిగి ప్రత్యామ్నాయంవైపు ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోను ఆవిష్కరించిన వారిలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మహేష్‌, నాయకులు చిట్టిబాబు, దేముడు, రఘునాథ్‌, స్టీల్‌ప్లాంట్‌ యూనియన్‌ నాయకులు కె.వెంకటరావు ఉన్నారు.

➡️