తాకట్టు బంగారం రికవరీ

Dec 9,2023 08:39 #AP police, #Crimes in AP, #srikakulam
police recovery gold

ఆభరణాల మాయం కేసును చేధించిన పోలీసులు-
ఏడుగురు అరెస్టు, ఒకరు పరారీ

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లా గార ఎస్‌బిఐలో గత నెల 30న మాయమైన తాకట్టు బంగారం కేసును పోలీసులు చేధించారు. గల్లంతైన ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న స్వప్నప్రియ, ఆమె సోదరుడు కిరణ్‌బాబు, బ్యాంకు క్యాషియర్‌ ముంజి సురేష్‌తో పాటు ఒక అపరిచిత వ్యక్తి సాయంతో నగరంలోని పొన్నాడ తిరుమలరావు నిర్వహిస్తున్న లోహితాక్షి లోన్స్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు 86 బ్యాగులతో కూడిన ఆభరణాలను ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు. తిరుమలరావు వాటిని శ్రీకాకుళం నగరంలో ఉన్న ఫెడరల్‌ బ్యాంకు, సిఎస్‌బి, అరసవల్లి, ఆమదాలవలసలోని సిఎస్‌బి బ్యాంకుల్లో వేర్వేరు వ్యక్తుల పేర్లతో బంగారం తాకట్టు పెట్టారని వివరించారు. లోన్‌, వడ్డీ కింద వచ్చిన డబ్బులను స్వప్నప్రియ చెప్పిన వ్యక్తుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. మొత్తం రూ.2.5 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఆభరణాల మాయం విషయం బయటకు పొక్కడంతో తిరిగి 26 బ్యాగులను బ్యాంకు వారికి అప్పగించారని వివరించారు. గల్లంతైన 60 బ్యాగుల్లో ఉన్న 7.146 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.4,07,33,340 ఉంటుందని వెల్లడించారు. తిరుమలరావుకు గతంలో స్వప్నప్రియ ఇచ్చిన 24.5 గ్రాముల బంగారాన్నీ స్వాధీనం చేసుకున్నామని, వాటి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఆభరణాల మాయంలో తొమ్మిది మందికి భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోగా, ఏడుగురిని అరెస్టు చేశామని, ముంజి సురేష్‌ను అదుపులోకి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. చేధించిన బంగారాన్ని కోర్టు ద్వారా బ్యాంకుకు, తర్వాత ఖాతాదారులకు అప్పగిస్తామని చెప్పారు.

➡️