గర్భిణిని చేతులపై మోస్తూ… వాగు దాటించిన గ్రామస్తులు

Dec 4,2023 09:19 #heavy rains, #tirupathi

ప్రజాశక్తి -నాగలాపురం (తిరుపతి జిల్లా) : ఓ వైపు ఎడతెరవని వర్షాలు..మరోవైపు భార్యకు పురిటినొప్పులు రావడంతో భర్తకు దిక్కుతోచలేదు. ఆస్పత్రికి తరలించాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటాలి. ఏమి చేయాలో పాలుపోక స్థానికుల సహాయం కోరారు. అందరూ కలిసి గర్భిణిని చేతులపై మోసుకుంటూ వెళ్తూ వాగు దాటించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం..గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగలాపురం మండలం కొట్టకాడు గ్రామం మధ్యలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే అదే గ్రామంలోని ప్రతిభ (21)కు పురిటినొప్పులు మొదలవ్వడంతో 108కు భర్త వెంకటేష్‌ ఫోన్‌చేసి విషయం చెప్పారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో వాగు వరకూ ఆమెను ఆటోలో కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. గ్రామస్తుల సహయంతో చేతుల మీద మోసుకుంటూ వాగు దాటించారు. అక్కడి నుంచి మరో ఆటోలో నాగలాపురం ఆస్పత్రికి తరలించారు. డెలివరీకి ఇంకా రెండు రోజుల సమయం ఉందని వైద్యులు తెలిపారు. పది రోజుల్లో డెలివరీ అయ్యే గర్భిణిలను దగ్గరలోని ఆస్పత్రులకు చేర్చాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

➡️