ఎన్‌ఆర్‌సి, సిఎఎకి వ్యతిరేకం

May 4,2024 21:33 #cm
  •  ముస్లింలకు మీ బిడ్డ అండగా ఉంటాడు!
  •  రిజిస్ట్రేషన్‌, పింఛన్ల విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
  •  హిందూపురం, పలమనేరు, నెల్లూరులో సిఎం జగన్‌

ప్రజాశక్తి – యంత్రాంగం : ‘ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం. ఎన్‌ఆర్‌సి, సిఎఎకి తాను వ్యరేకమం. బిజెపి ప్రభుత్వం ఓ వైపు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తుంటే ఆ పార్టీతో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకొని ఊసరవెల్లి రాజకీయం చేస్తున్నారు’ అని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సిఎం జగన్‌ ప్రసంగించారు.
ఎన్‌డిఎలో కొనసాగుతూ ముస్లింలకు చంద్రబాబు ఏలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తాను ధైర్యంగా చెబుతున్నానని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంచి తీరుతామన్నారు. ఇది జగన్‌ మాట అని, దీని కోసం ఎంత దూరమైన పోరాటం చేస్తానని చెప్పారు. చంద్రబాబు ఈ మాట మోడీ సభలో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎన్‌డిఎ నుంచి బయటకు రాగలరా? ఓ వైపు ఎన్‌డిఎలో కొనసాగుతూ ముస్లింలకు వ్యతిరేకమైనా వారితోనే ఉన్నారన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లింలకు మతం ప్రాతిపదికన ఇచ్చినవి కాదని, వారిలో కూడా పఠాన్‌, సయ్యద్‌ వంటి ఉన్నత వర్గాలకు వర్తించడం లేదన్నారు. కేవలం పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నామని తెలిపారు. ఐదేళ్లలో ముస్లిముల కోసం ఉర్దూను రెండో అధికార భాషగా చేశానని, నలుగురు. ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలతోపాటు డిప్యూటీ స్పీకర్‌, డిప్యూటీ శాసన మండలి స్పీకర్‌ పదవి ఇచ్చామని వివరించారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు ద్వారా పేదల భూములను లాగేసుకుంటారంటూ టిడిపి అధినేత చంద్రబాబు చెబుతున్న మాటలు అబద్ధమని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని మార్పుల విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు అన్నది రైతులకు శాశ్వత హక్కు కల్పించే కార్యక్రమంగా తాము చేపట్టినట్టు వివరించారు. వంద ఏళ్ల నాటి రికార్డులను సరిచేసి ప్రభుత్వం తరపున భూములకు గ్యారెంటీ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూములు లాగేసుకునే వాడు కాదని…భూములు పంచేవాడని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లలో కార్డు-1 ఉన్న సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసి కార్డు-2 కు తీసుకెళ్లామన్నారు. ప్రజలు మరింత సులువుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలుగా మార్పులు చేపడితే దాన్ని తప్పుబడుతూ టిడిపి ప్రచారాన్ని చేపట్టిందని విమర్శించారు. చంద్రబాబు అంటే నిత్యం మోసాలు, కుట్రలేనని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలోనూ ఇదే రకమైన తప్పుడు వాగ్ధానాలతో గద్దెనెక్కి తరువాత అమలు చేయకుండా మోసం చేసారని విమర్శించారు. రాబోవు ఐదేళ్లలో ప్రతి పేదవాడి భవిష్యత్‌ బాగుపడాలన్నా, సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలన్నా వైసిపిని ఆదరించాలని కోరారు. మధ్యవర్తులు అవసరం లేని, లంచాలకు తావులేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి ప్రజారంజక పాలన అందించామన్నారు. తమ పాలనలో గ్రామాల్లో దాదాపు 600 రకాల సేవలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని, వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటికే పారదర్శకంగా సేవలందిస్తున్నామన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాలతో అమలు కాని హామీలు ప్రకటిస్తూ మరలా ప్రజలను మోసగించేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

➡️