గుంటూరులో రియల్టర్‌ దారుణ హత్య

May 22,2024 23:07 #gunter, #Hatya

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆర్థికపరమైన లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు అరండల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధి సంజీవయ్యనగర్‌ 2వ లైనులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కంచర్ల దేవనందం నివశిస్తున్నారు. గతకొంతకాలంగా ఆయన గుంటూరుకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో తిరిగి గుంటూరుకు వచ్చారు. ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన తమ సమీప బంధువులతో దేవనందంకు ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం సేవించేందుకు కొందరు యువకులు బుధవారం రాత్రి ఆయనను పిలించారు. అనంతరం ఇంటి వద్ద వదిలిపెడతామని చెప్పి మార్గమధ్యంలో కత్తులతో దాడి చేశారు. దీంతో దేవనందం అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆర్ధిక పరమైన లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

➡️