ఎన్‌టిఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

Nov 22,2023 22:13 #road accident

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌ జిల్లా):ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్కన నిలిచి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఎనిమిది మంది యువకులు అరకులోని ప్రకృతి అందాలు తిలకించేందుకు కారులో వెళ్లారు. అరకు పర్యటన అనంతరం తిరుగుప్రయాణం అయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నంలోని కేతనకొండ వద్దకు చేరుకోగానే కారు డ్రైవరు నిద్ర మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంలో కూర్చున్న నిజామాబాద్‌ చెందిన ధర్మతేజ (23), హైదరాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన శాంతి కుమార్‌ (23) అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిఐ పి శ్రీను కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️