రోడ్లు నిర్మించాలి.. ఐటిడిఎ డిఎ కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా

Jan 8,2024 20:17 #Dharna, #Girijana Sangham, #itda

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం కొండలపైన మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ భద్రగిరి ఐటిడిఎ ఇంజనీరింగ్‌ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి నేటికి 77 ఏళ్లు గడిచినా మారుమూల కొండలపై గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడం విచారకరమన్నారు. ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది పాలకులు మారినా గిరిజనుల అభివృద్ధి మాత్రం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా గిరిజనుల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న శ్రద్ధ అంటూ ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న కోట్లాది రూపాయలు మంత్రులు, ఎమ్మెల్యేలు జేబుల్లోకి వెళ్తున్నాయి తప్ప గిరిజన ప్రాంతాభివృద్ధికి ఏ మాత్రమూ ఉపయోగించడంలేదని విమర్శించారు. నేటికీ చాలా గిరిజన గ్రామాల్లో డోలిలే శరణ్యమంటూ పలు పత్రికల్లో వార్తలు వస్తున్నా పాలకులు స్పందించకపోవడం దారుణమన్నారు. నేటికీ గిరిజనులు వెనుకబాటు జీవనం గడుపుతున్నారని పేర్కొన్నారు. సంఘం సహాయ కార్యదర్శి మండంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటిడిఎ దిష్టిబొమ్మగానే మిగిలిందన్నారు. రోడ్డు మార్గాల్లేక, సకాలంలో వైద్యమందక ఎంతో మంది గిరిజనులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించాలని, తాగునీరందించాలని, వైద్య సౌకర్యం మెరుగుపర్చాలని గిరిజనులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి మండంగి రమణ, నాయకులు ఎం సన్యాసిరావు, బిడ్డిక ఆడిత్‌, బిడ్డిక శంకర్రావు పాల్గొన్నారు.

➡️