500కే గ్యాస్‌ బండ -200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

Feb 28,2024 08:40 #Congress, #gas cylinder, #Telangana

-మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించిన తెలంగాణ సిఎం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను మంగళవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కెసిఆర్‌ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఆర్థిక నియంత్రణ కొనసాగిస్తూ క్రమశిక్షణతో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. మహిళలకు దీపం పథకం ద్వారా రూ.400కే యుపిఎ ప్రభుత్వం గ్యాస్‌బండ ఇస్తే… బిజెపి ప్రభుత్వం దాన్ని రూ.1200కు పెంచినా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్‌ నోరు విప్పలేదన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట శిలాశాసనమన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగదారులందరికీ మార్చిలో జీరో బిల్లు వస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అక్కసుతో బిఆర్‌ఎస్‌ నాయకులు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ రూ.500కే గ్యాస్‌బండ సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️