ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌

Jan 17,2024 10:02 #16, #February, #Rural Bandh
  • దేశమంతటా భారీ ప్రదర్శనలు
  • కార్పొరేట్‌ దోపిడీ అంతానికి పోరాటం తీవ్రతరం
  • ఎస్‌కెఎం అఖిల భారత కన్వెన్షన్‌ పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులపై కార్పొరేట్‌ దోపిడీని అంతం చేయడానికి పోరాటాలను తీవ్రతరం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) అఖిల భారత కన్వెన్షన్‌ పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 16న దేశమంతటా గ్రామీణ బంద్‌, భారీ ప్రదర్శనలను చేపట్టాలని కోరింది. మంగళవారం పంజాబ్‌లోని జలంధర్‌లో దేశ్‌ భగత్‌ యాద్గార్‌ మెమోరియల్‌లోని బాబా జవాలా సింగ్‌ ఆడిటోరియంలో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) అఖిల భారత రైతు సదస్సు జరిగింది. వ్యవసాయ సంక్షోభం, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానంపై ప్రకటన చేసింది. కిసాన్‌ ఐక్యత, కార్పొరేట్‌-మతపరమైన బంధానికి వ్యతిరేకంగా కిసాన్‌, కార్మిక ఐక్యత, ఎస్‌కెఎం నాయకులపై ప్రతీకార దాడిని ఖండిస్తూ తీర్మానాలను కన్వెన్షన్‌ ఆమోదించింది. ఢిల్లీ సరిహద్దులో కిసాన్‌ అమరవీరుల స్మారకం, కిసాన్‌ షహీద్‌ స్మారక్‌ను నిర్మించాలని సమావేశం ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. గణతంత్ర దినోత్సవం జనవరి 26న ట్రాక్టర్‌, వాహన కవాతును విజయవంతం చేయాలని, కార్పొరేట్‌ దోపిడీని అంతం చేస్తామని, ప్రజాస్వామ్య, సెక్యులర్‌, ఫెడరల్‌, సోషలిస్ట్‌ వంటి రాజ్యాంగ సూత్రాలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయాలని సదస్సు రైతులు, కార్మికులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రైతుల భూములను లాక్కోవడానికి, రైతుల ఆర్థిక పరిస్థితిని దిగజార్చేందుకు ఉద్దేశపూర్వకంగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్న కేంద్రంలోని కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని శిక్షించాలని దేశ వ్యాప్తంగా రైతులను విజ్ఞప్తి చేసే తీర్మానాన్ని కన్వెన్షన్‌ ఆమోదించింది. పంటల ఉత్పత్తి, ఆహార సరఫరా గొలుసును నియంత్రించి, లాభాపేక్ష కోసం సామాన్య ప్రజలను మరింత అణిచివేసేందుకు గుత్తాధిపత్యంతో కార్పొరేట్లు వ్యవసాయంలోకి చొరబడేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది.

వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానం, కార్పొరేట్‌ గుత్తాధిపత్యం నుండి బయటపడాలని, ప్రభుత్వ పెట్టుబడి, ఉత్పత్తి సహకార సంఘాలు, ఇతర వ్యక్తుల కేంద్రీకృత నమూనాల ఆధారంగా రైతులకు లాభదాయకమైన ధర, కార్మికులు గౌరవప్రదమైన జీవితం, వేతనాలను పొందాలని డిక్లరేషన్‌ డిమాండ్‌ చేసింది. అన్ని వర్గాల ప్రజలకు పెన్షన్‌తో సహా భద్రత లభించాలని పేర్కొంది. ఈ కన్వెన్షన్‌లో ఎస్‌కెఎం నాయకులు దర్శన్‌ పాల్‌, పి. కృష్ణప్రసాద్‌, రాజారామ్‌ సింగ్‌, సునీలం, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ తదితరులు మాట్లాడారు.12 డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం1. పంటల సేకరణ హామీతో అన్ని పంటలకు సి2 ప్లస్‌ 50 శాతంతో కనీస మద్దతు ధర ఇవ్వాలి. 2. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాని తొలగించి, లఖింపూర్‌ ఖేరీలో రైతులను ఊచకోత కోసినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలి. 3. చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు సమగ్ర రుణమాఫీ. రుణభారం నుండి విముక్తి చేయాలి. 4. ప్రభుత్వ రంగంలో సమగ్ర పంటల బీమా, కార్మికులకు నెలకు రూ. రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి. 5. ఉపాధి హామీ ప్రాథమిక హక్కు. 6. రైల్వే, రక్షణ, విద్యుత్‌ సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలి. 7. ఉద్యోగాల్లో కాంట్రాక్టీకరణ ఆపాలి. 8. ఫిక్స్‌డ్‌ టెర్మ్‌ ఉపాధిని రద్దు చేయాలి. 9. ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 200 రోజుల పని, రూ.600 రోజువారీ వేతనంతో ఉపాధి హామీని బలోపేతం చేయాలి. 10. పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలి. 11. సంఘటిత, అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో అందరికీ పెన్షన్‌, సామాజిక భద్రత కల్పించాలి. 12. ఎల్‌ఎఆర్‌ఆర్‌ చట్టం -2013 (భూసేకరణ, పరిహారం, పునరావాస చట్టం, 2013లో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు, 2013)ని అమలు చేయాలి.పంజాబ్‌లో 32 సంఘాల వేదికగా ఎస్‌కెఎంబికెయు (రాజెవాల్‌) నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ సంయుక్త కిసాన్‌ మోర్చాతో తిరిగి కలిశారు. రాజేవాల్‌ ప్రిసీడియంలో సభ్యునిగా ఉండి ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. బికెయు (రాజెవాల్‌)తో పాటు నాలుగు రైతు సంఘాలు కూడా ఎస్‌కెఎంతో తిరిగి కలిశాయి. బికెయు (ఉగ్రహన్‌) ఎస్‌కెఎం పంజాబ్‌తో సమన్వయంతో పని చేస్తోంది. పంజాబ్‌లోని ఎస్‌కెఎం ఇప్పుడు 32 సంఘాల వేదికగా బలోపేతమైంది.

➡️