చిరంజీవిని విమర్శించినట్లు దుష్ప్రచారం – సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చిరంజీవిపై ఎలాంటి విమర్శలు చేయకున్నా.. చేసినట్లు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నిందలు వేస్తున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఇబ్బంది పడిన చంద్రబాబు చీకటి పాలనను ఎవరూ మర్చిపోలేదని, ఎన్నికలు వున్నాయని ఆయన చెప్పే అబద్ధాలను కూడా ఎవరూ నమ్మరని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికలకు ముందు ఇదే బిజెపి, జనసేనతో జతకట్టిన బాబు మేనిఫెస్టోను పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. చంద్రబాబును, పవన్‌కల్యాణ్‌ను ప్రజలు నమ్మడం లేదనే చిరంజీవిని వివాదంలోకి లాగుతున్నారని అన్నారు. జగన్‌ కుటుంబం గురించి మాట్లాడే చంద్రబాబు తన చెల్లెళ్లకు, సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడుకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఎన్నికల్లో గెలవలేమని చివరకు ఎన్నికల కమిషన్‌ను కూడా బ్లాక్‌మెయిల్‌ చేసి అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారని విమర్శించారు.
‘ఎన్నికల నిబంధనలు పాటించడం లేదు’
ఎన్నికల నిబంధనలను చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పాటించడం లేదని వైసిపి గ్రీవెన్స్‌ సెల్‌ ఛైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి హయాంలోనే కాపులకు ఎక్కువ మేలు జరిగిందని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు అన్నారు. డ్వాక్రాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మహిళా కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. కూటమిది కుమ్మక్కు రాజకీయం అని పోతిన మహేష్‌ ఆరోపించారు.

➡️