ఎన్నికల వేళ బంగారం, నగదు స్వాధీనం

ప్రజాశక్తి- యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా పెద్దమొత్తంలో తరలిస్తున్న నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక 216వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద బలేరో వాహనంలో తరలిస్తున్న రూ.1.04 కోట్ల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాదీనం చేసుకున్నామని రాజమహేంద్రవరం సౌత్‌ జోన్‌ డిఎస్‌పి ఎం.అంబికాప్రసాద్‌ తెలిపారు. కడియం సిఐ బి.తులసీధర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా వీటిని గుర్తించారన్నారు. తహశీల్దార్‌ బి.రమాదేవి సమక్షంలో జిఎస్‌టి, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు పత్రాలను పరిశీలించారన్నారు. తదుపరి విచారణ నిమిత్తం జిల్లా గ్రీవెన్స్‌ కమిటీకి తరలించామని తెలిపారు.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె చెక్‌పోస్ట్‌ వద్ద శనివారం చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.20 లక్షల నగదు పట్టుబడింది. కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళుతున్న రంగారెడ్డి అనే వ్యక్తికి చెందిన కారును తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు పాణ్యం సిఐ నల్లప్ప తెలిపారు.

➡️