విద్యారంగ పరిరక్షణకు ఐక్య పోరాటం

Dec 29,2023 13:41 #Kakinada, #maha sabha, #SFI
sfi state conference in kakinada 3rd day

భగత్ సింగ్ వారసత్వంతో ముందుకెళ్లాలి
ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు విపి సాను
అల్లూరి సీతారామ‌రాజు న‌గ‌ర్ నుంచి ప్ర‌జాశ‌క్తి ప్ర‌త్యేక ప్ర‌తినిధి

ప్రజాశక్తి-కాకినాడ : దేశంలో విద్యా రంగ పరిరక్షణకు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు విపి సాను పిలుపు ఇచ్చారు. అల్లూరి సీతారామ‌రాజు న‌గ‌ర్ (అంబేద్క‌ర్ భ‌వ‌న్‌)లో శుక్ర‌వారం జ‌రిగిన‌ ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మ‌హాస‌భలో విపి సాను మాట్లాడుతూ దేశంలో యువ‌త‌, విద్యార్థుల‌కు భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌, అల్లూరి, కందుకూరి వంటి మ‌హానీయులు గురించి తెలియ‌టం లేద‌ని అన్నారు. చరిత్ర‌ను మార్చి రాసేందుకు మోడీ స‌ర్కార్ పూనుకోవ‌డంతో ఆ మ‌హానీయులు గుర్తులు కూడా చెరిగిపోతున్నాయ‌ని పేర్కొన్నారు. మొద‌టి దేశ ప్ర‌ధాని నెహ్రూను చెప్పుకుంటామ‌ని, భార‌త్ మొద‌టి ప్ర‌ధాని మోడీగా చెప్పుకోవాల‌ని ఇండియా స్థానంలో భార‌త్‌ను తీసుకొస్తున్నార‌ని విమ‌ర్శించారు. గుజ‌రాత్  అభివృద్ధి మోడ‌ల్ పేరుతో పెద్ద ప్ర‌చారం చేశార‌ని, కానీ గుజ‌రాత్‌లో ఏ  అభివృద్ధి లేద‌ని అన్నారు. తాను చాలా సార్లు గుజ‌రాత్‌లో ప‌ర్య‌టించాన‌ని, అక్క‌డి గ్రామీణ ప్రాంతాల‌ను సంద‌ర్శించాన‌ని తెలిపారు. అయితే దేశంలో అతి త‌క్కువ రోజువారీ కూలీ గుజ‌రాత్‌లోనే ఉంద‌ని, అక్క‌డి కంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఎక్కువ రోజువారీ కూలీ ఉంద‌ని అన్నారు. కేర‌ళ‌లో రోజువారీ కూలీ రూ.800పైగా ఉంద‌ని, ఏపిలో రూ.600 ఉంద‌ని, గుజ‌రాత్‌లో కేవ‌లం రూ.195 మాత్ర‌మే ఉంద‌ని వివ‌రించారు. ఇదే మోడీ గుజ‌రాత్  అభివృద్ధి మోడ‌ల్ అని విమ‌ర్శించారు. దేశం నుంచి ప‌దేళ్ల‌లో 60 ల‌క్ష‌ల మంది సిటిజ‌న్ షిప్ వ‌దులుకున్నార‌ని, ఇదే దేశంలోని మోడీ  అభివృద్ధి మోడ‌ల్ అని విమ‌ర్శించారు. దేశంలో విద్యా, ఉపాధి దొర‌క‌కే ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స పోతున్నార‌ని పేర్కొన్నారు. ఇటీవ‌లి తెలంగాణ ఎన్నిక‌ల్లో కేంద్ర హోం మంత్రి బిజెపి గెలిస్తే అయోద్య‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, కానీ ఉచిత విద్యా, ఆరోగ్యం, ఉపాధి క‌ల్పిస్తామ‌ని హామీ ఇవ్వ‌లేద‌ని అన్నారు. ఇదే బిజెపి  అభివృద్ధి మోడ‌ల్ అని విమ‌ర్శించారు.

  • రాజ‌కీయాల‌ను మార్చే విధంగా పోరాటాలు

రాజ‌కీయాల‌ను మార్చే విధంగా పోరాట కార్యాచ‌ర‌ణ ఉండాల‌ని విపి సాను పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తున్న‌ట్ల‌నే, జ‌మ్మూకాశ్మీర్‌కు ప్ర‌త్యేక హోదా ఉంద‌ని, దాన్ని మోడీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింద‌ని విమ‌ర్శించారు. దేశానికి స‌మీపంలో ఉన్న నేపాల్‌, భూట‌న్ దేశాల‌కు వెళ్ల‌డానికి పాస్‌పోర్టు అవ‌స‌రం లేద‌ని, కానీ దేశంలోని అంత‌ర్భంగా ఉన్న ల‌క్ష్య‌దీప్‌, అండ‌మాన్ వంటి వాటికి వెళ్లాలంటే అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి అన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఆ అనుమ‌తి పెట్టార‌ని, అలాగే జ‌మ్మూకాశ్మీర్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక హోదా ఉంద‌ని అన్నారు. అయితే అది రద్దు చేసిన మోడీ శ‌క్తివంత‌మైన నాయ‌కుడిగా కీర్తించ‌డం దారుణ‌మ‌న్నారు.

  • భ‌గ‌త్ సింగ్ స్ఫూర్తితో పోరాటం

నాడు బ్రిటిష్ సామ్రాజ్య‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాడిన భ‌గ‌త్ సింగ్ స్ఫూర్తితో నేటి మోడీ స‌ర్కార్ విద్యార్థి వ్య‌తిరేక విధానాల‌పై పోరాటాన్ని నిర్మించాల‌ని పిలుపు ఇచ్చారు. దేశంలో అంద‌రికీ విద్య‌, ఉపాధి కోసం భ‌గ‌త్‌సింగ్ వార‌స‌త్వంతో ముందుకు సాగాల‌ని, విద్య రంగ సమ‌స్య‌ల‌ను 2024 ఎన్నిక‌ల్లో రాజ‌కీయ అజెండాగా మార్చాల‌ని పిలుపు ఇచ్చారు. బిజెపి నుంచి దేశాన్ని కాపాడాల‌ని, విద్యా రంగాన్ని ప‌రిర‌క్షించాల‌ని, అందుకోసం జ‌న‌వ‌రి 12న చ‌లో ఢిల్లీ ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.

➡️