ఆధారాలున్నా అవినాష్‌ను కాపాడుతున్న జగన్‌

Apr 8,2024 20:32 #CM YS Jagan, #ys sharmila
  •  అబద్దాల హామీలతో ప్రజలను మోసగిస్తున్న సిఎం
  • బస్సుయాత్రలో వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి-బ్రహ్మంగారిమఠం (వైఎస్‌ఆర్‌ జిల్లా) : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు ఉన్నా కడప ఎంపి అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాపాడుతున్నారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజవకర్గంలోని బ్రహ్మంగారిమఠం, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరులో సోమవారం నాలుగోరోజు బస్సుయాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు, జగన్‌ పరిపాలనకు ఏ మాత్రమూ పొంతన లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపి అవినాష్‌రెడ్డి నిందితుడని సిబిఐ తేల్చి చెప్పిందని, కాల్‌ రికార్డులు, గూగుల్‌ మ్యాప్స్‌, లావాదేవీలు ఉన్నట్లు పేర్కొందని తెలిపారు. అన్ని ఆధారాలున్నా అవినాష్‌ని జగన్‌ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదని, సబ్సిడీలో డ్రిప్పు వేసుకోవడానికి అవకాశం లేకుండా సబ్సిడీలు అన్నీ ఆపేశారని విమర్శించారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, మెగా డిఎస్‌సి వేస్తామని జగన్‌ హామీ ఇచ్చారని, కానీ, నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయి కేవలం ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారని పేర్కొన్నారు. మూడు నెలల క్రితం నోటిఫికేషన్‌ ఇవ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. సొంత బాబాయిని చంపిన నిందితులకే టికెట్‌ ఇస్తున్నారని, హంతకులు చట్ట సభలలో వెళ్లకూడదని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. న్యాయం కోసం పోరాటం ఓవైపు హంతకులు మరోవైపు ఉన్నారని, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత మాట్లాడుతూ మహిళ అంటే నారీశక్తి అని, తమను అలాగే పెంచారని చెప్పారు. తప్పుంటే తప్పని చెప్పే దైర్యం ఉందని తెలిపారు. వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసని, న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. భారీ మెజార్టీతో షర్మిలను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌ తులసిరెడ్డి, డిసిసి అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు పాల్గొన్నారు.

➡️