ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకం

Supreme judgment on electoral bonds is historic

సిపిఎం రాష్ట్ర కమిటీ హర్షం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సిపిఎం రాష్ట్ర కమిటి పేర్కొంది. ఈ మేరకు సుప్రీం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలలో దొంగడబ్బు, నల్లధనం విచ్చలవిడిగా ప్రవహిస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు వారి ప్రయోజనా లను ప్రోత్సాహించే అభ్యర్ధులు, రాజకీయపార్టీలకు డబ్బును వెదజల్లుతూ ప్రజాతీర్పును తలకిందులు చేస్తున్నారని తెలిపారు. ఇదే నల్లడబ్బుతో ఓడిపోయిన పార్టీ ప్రతినిధులను కొనుగోలు చేసి ప్రభుత్వాలను సైతం తారుమారు చేస్తున్నా రన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తీర్పు చాలా ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా కోర్టులో సిపిఎం కూడా పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల ఖర్చులో పారదర్శకత ఉండాలని కోరుకునే పార్టీల్లో సిపిఎం ముందు వరసలో వుంటుందని పేర్కొన్నారు. ఈ తీర్పు నేపధ్యంలో ఎన్నికల బాండ్లను పూర్తిగా నిషేధించాలి. ఏ కంపెనీ అయినా, ఏ వ్యకైనా ఎవరికి ఎంత డబ్బు ఇస్తున్నాడో, ఆ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందో లెక్క ఉంటేనే నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకోగలమని తెలిపారు. అధికార పార్టీ ప్రత్యేకించి మోడీ ప్రభుత్వం ప్రత్యర్ధి పార్టీలపైకి ఇడి, ఐటి లాంటి సంస్థలను ప్రయోగించి వారి దగ్గరున్న డబ్బును లాక్కొవడం, తమ పార్టీ అభ్యర్ధులు పెట్టే ఖర్చులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా వదిలేయడం లాంటివి సర్వసాధారణమయ్యాయని పేర్కొన్నారు. అన్ని పార్టీలకు ఎన్నికల్లో ఖర్చు పెట్టేదానికి ఒకే విధమైన విధివిధానాలు ఉంటే ఎన్నికల సంస్కరణల్లో ఒక ముఖ్యభాగం పూర్తవుతుందని తెలిపారు. ఆ దిశగా సుప్రీంకోర్టు కూడా చొరవ తీసుకుని నియమ నిబంధనలు రూపొందించాలని కోరారు. ఎన్నికల ఖర్చులలో పారదర్శకత లోపించడం వల్ల శత కోటీశ్వరులు చట్టసభల్లో ఎంపీలు, ప్రజా ప్రతి నిధులుగా మారి వారికి అనుకూలమైన చట్టాలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలలో దొంగడబ్బును అరికట్టగలిగే ఈ తీర్పును సిపిఎం స్వాగతిస్తోందని తెలిపారు.

తీర్పును స్వాగతిస్తున్నాం : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

రాజకీయాలను, ఎన్నికల వ్యవస్థను మొత్తం డబ్బుమయం చేసే ఎన్నికల బాండ్ల ప్రక్రియను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారపార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా నిధుల సేకరణ అంటే ఇష్టారాజ్యంగా క్విడ్‌ ప్రో చేసుకునే అవకాశం వుందని తెలిపారు. అలాగే రాజకీయ పార్టీలకు వచ్చే నిధులను పారదర్శకంగా వుండాలని ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకురావడం కూడా మంచి పరిణామమని తెలిపారు.

➡️