సకాలంలో పెన్షన్‌ అందించేలా చర్యలు తీసుకోండి – సిపిఎం రాష్ట్ర కమిటీ

Apr 1,2024 09:05 #CPM State Committee, #prakatana

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వలంటీర్ల ద్వారా అందజేసే పెన్షన్‌ల పంపిణీని ఎన్నికల కమిషన్‌ నిలిపివేయడంతో ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సకాలంలో వృద్ధులు, మహిళలు, వికలాంగులకు పెన్షన్లు అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. గతంలోలాగా ప్రభుత్వం పెన్షన్‌ల పంపిణీ కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, రెవెన్యూ ఉద్యోగుల సేవలు ఉపయోగించుకుని నేరుగా పెన్షన్‌దారులకు పెన్షన్‌ అందించాలని కోరారు. సచివాలయాలు దూరంగా ఉన్నచోట దగ్గరలో ఉండే పంచాయతీ కార్యాలయాలు, సిబ్బందిని పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియకు ఉపయోగించుకోవాలని సూచించారు. రాజకీయంగా న్యూట్రల్‌గా ఉంచి సంక్షేమ పథకాలను అందించాల్సిన వలంటీర్‌ వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం వైసిపి దుర్వినియోగం చేస్తోందని గతంలో సిపిఎం పదేపదే ప్రభుత్వం దృష్టికి తెచ్చిందని గుర్తు చేశారు. వలంటీర్‌ వ్యవస్థ దుర్వినియోగం చేసిన ఫలితంగానే నేడు సకాలంలో పెన్షన్లు అందించలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా వలంటీర్‌ వ్యవస్థ తటస్థంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️