ఫిర్యాదులపై చర్యలేవీ? : ఇసిని ప్రశ్నించిన టిడిపి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ఎన్నికల కమిషన్‌ను టిడిపి నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. వైసిపి ఫిర్యాదు చేయగానే తమ అధినేతలపై కేసులు నమోదు చేసి ఆదేశిస్తున్న కమిషన్‌.. తమ ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నలుగురు ఆడబిడ్డలపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిని గుర్తించి, అరెస్టు చేయించి వారికి న్యాయం చేయాలని కోరారు. పింఛన్‌ పంపిణీ వ్యవహారంలో చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసిపి చేసిన దుష్ప్రచారంలో సిఎం వైఎస్‌ జగన్‌, వైసిపి నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్‌ రెడ్డి కుట్రదారులని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో వీరి పేర్లు కూడా నమోదు చేయాలని కోరారు.

పోస్టల్‌ బ్యాలెట్‌పై గోప్యత దేనికి : టిడిపి
పోస్టల్‌ బ్యాలెట్‌పై అంత గోప్యత దేనికని సిఇఒను టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారని, జిల్లాల వారీ ఆ జాబితాను ఎందుకు బయటకు చెప్పడం లేదని ప్రశ్నించారు. స్థిరాస్తులే లేని జగన్‌ కుటుంబానికి రూ.లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జగన్‌ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కూటమి నేతలు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, శివశంకర్‌, పాతూరి నాగభూషణం విమర్శించారు.

➡️