నా భర్త ఆచూకీ చెప్పండి

  • విజయవాడ సిపి కార్యాలయం ముందు ఆందోళన

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు ఆచూకీ తెలపాలంటూ శనివారం ఆయన సతీమణి శాంతి విజయవాడ సిపి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆమెకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్ర వడ్డెర సంఘం నేతలు బత్తుల దుర్గారావు, కుంచెం సావిత్రి, వేముల బాజీ నిలిచారు. ఈ సందర్భంగా శాంతి మీడియాతో మాట్లాడుతూ.. రాయి దాడి కేసులో తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దుర్గారావు ఆచూకీ తెలపాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు సిపి కార్యాలయానికి తాము వచ్చామని, తమకు పోలీసులు అనుమతినివ్వలేదని ఆమె పేర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందనే ఉద్ధేశంతో కార్యాలయం ముందు ఆందోళన చేసిన వారిని సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. సౌత్‌ ఎసిపి రత్నరాజు, ఎడిసిపి టాస్క్‌ఫోర్స్‌్‌ శ్రీహరిబాబు, నార్త్‌ ఎసిపి ప్రసాద్‌ వడ్డెర సంఘం నాయకులతో మాట్లాడారు.
బొండాను ఇరికించేందుకు ప్రయత్నం : ఎన్నికల కమిషనర్‌కు టిడిపి ఫిర్యాదు
టిడిపి సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఈ కేసులో అక్రమంగా ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు చేసింది.

➡️