మతోన్మాది బిజెపిని.. అనుకూల పార్టీలను ఓడించాలి : బి.తులసీదాస్

ప్రజాశక్తి-శ్రీకాకుళంఅర్బన్ : మతోన్మాద బిజెపితో జత కలిసిన టిడిపి, జనసేన కుటమిని నిరంకుశ వైసిపిలను ఓడించాలని.. ప్రత్యామ్నాయ లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా విస్తృత సమావేశం బి.కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ మాట్లాడుతూ బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని.. లోక్ సభలో సిపిఎం, వామపక్షాల బలాన్ని పెంచాలని.. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఏర్పడేలా చూడాలన్నారు. కేంద్రంలో మోడీ నియంతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దశాబ్దకాలంగా సాగించిన పాలనతో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, భారత రిపబ్లిక్, సమాఖ్యవాదం ప్రమాదంలో పడిన నేపథ్యంలో 2024లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగానికి 4మూల స్తంభాలుగా భావించే లౌకికవాదం, ప్రజాస్వామ్యం,ఆర్థికసార్వభౌమత్వం, సమైక్యవాదం, సామాజిక న్యాయ వ్యవస్థలను ఒక పద్ధతి ప్రకారం బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం దేశంలో కార్మిక హక్కులు నాశనం చేసేందుకు నిరంకుశ పద్ధతులు ఉపయోగిస్తుందని తద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో కెల్లా అత్యంత అసమానతలు కలిగిన సమాజాల్లో ఒకటిగా మారుస్తుందని విమర్శించారు. మరో ప్రక్కన ప్రజలను మతపరంగా విభజించేందుకు విషపూరితమైన తన మతోన్మాద సిద్ధాంతాలను ఉపయోగిస్తుందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోవడం బిజెపి తొత్తుగా వైసిపి వ్యవహరించడం ఆంధ్ర ప్రజలు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ అరుకు పార్లమెంట్ కు సిపిఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని, సిపిఎం అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు .ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు కె. మోహనరావు, కె.నాగమణి యన్. షణ్ముఖరావు,పి.తేజేశ్వరరావు, సిర్ల. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️