ఉప ఎన్నిక తప్పింది.. కామారెడ్డిలో రేవంత్‌, కెసిఆర్‌ ఓటమి

Dec 3,2023 20:54 #Assembly Elections, #Telangana
  • రెండు చోట్లా ఓడిన బిజెపి నేత ఈటల

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చి ఉప ఎన్నికను తప్పించారు. గజ్వేల్‌, కామారెడ్డి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల నుంచి ముగ్గురు ప్రధాన పార్టీల నేతలు పోటీకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్కొక్కరు రెండు చోట్ల పోటీ పడటంతో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనని అంతా ఎదురు చూశారు. ఒక వ్యక్తి రెండు చోట్ల పోటీ చేసేందుకు వీలుంటుంది. ఒక వేళ గెలిస్తే ఆ రెండు చోట్లా ఎమ్మెల్యేగా కొనసాగడం కుదరదు. ఏదొక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే ఓటర్లు తెలివిగా ఆలోచించి ఓటేశారు. ఎక్కడా ఉప ఎన్నిక రాకుండా జాగ్రత్త పడ్డారు. బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ ఈసారి గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేశారు. మరోవైపు రేవంత్‌రెడ్డి సైతం సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్‌ వేశారు. ఇద్దరూ స్థానికేతరులు కావడంతో ఓటర్లు బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి వైపు మొగ్గు చూపారు. కెసిఆర్‌ గజ్వేల్‌లో, రేవంత్‌ కొడంగల్‌లో మాత్రమే గెలిచారు.బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేశారు. రెండు చోట్లా ఆయన ఓటమి పాలయ్యారు.

➡️