కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటమే జగ్జీవన్‌రామ్‌కు నివాళి : వి శ్రీనివాసరావు

Apr 5,2024 22:40 #caste, #KVPS, #V Srinivasarao
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే జగ్జీవన్‌రామ్‌కు ఘనమైన నివాళి అని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయవాడ శిఖామణి సెంటర్‌లోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్‌ బాబూరావు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జిల్లా కార్యదర్శి జి నటరాజ్‌తో కలిసి శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభకు అండ్ర మాల్యాద్రి అధ్యక్షత వహించారు. సభలో విఎస్‌ఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో మనువాద, మతోన్మాద పాలనలో కుల వ్యవస్థ పెరిగిపోతోందన్నారు. రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేస్తూ రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారన్నారు. జగ్జీవన్‌రామ్‌ కార్మికశాఖ మంత్రిగా కార్మిక చట్టాలను తీసుకొస్తే, మనువాద మతోన్మాద పాలకులు నాలుగు లేబర్‌కోడ్‌లు తెచ్చి కార్మిక చట్టాలను, యాజమాన్యాలకు తాకట్టు పెడుతున్నారన్నారు. నాడు ఉద్యోగుల బీమా చట్టం ద్వారా ప్రావిడెంట్‌ ఫండ్‌ను ఏర్పాటుచేసి కార్మికుల జీవితాలకు భరోసా కల్పిస్తే నేటి మనువాద మతోన్మాద పాలకులు ఆ నిధులను కాజేస్తున్నారని శ్రీనివాసరావు విమర్శించారు. దేశంలో కుల వ్యవస్థ పెరిగిపోతోందనడానికి మన రాష్ట్రంలో నేటికీ జరుగుతున్న కుల దురహంకార హత్యలు, దారుణమైన కుల దురహంకార దాడులే ఉదాహరణ అని అన్నారు. విజయవాడలో సైతం దళిత ఉద్యోగులకు ఇళ్లు అద్దెకు ఇవ్వకపోవడం నిదర్శన మన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన వారిలో డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి క్రాంతికుమార్‌, నాయకులు శ్యామ్‌బాబు, రారాజు, నరసింహారావు, గురుమూర్తి, కిరణ్‌, వరప్రసాద్‌, గంగాధర్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.
➡️