ముగిసిన నాలుగో దశ ప్రచారం

May 12,2024 09:54 #campaign, #fourth phase
  • 10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు పోలింగ్‌
  • బరిలో 1,717 మంది అభ్యర్థులు
  • ఆంధ్రప్రదేశ్‌, ఒడిషాలో అసెంబ్లీకీ పోలింగ్‌
  • రాష్ట్రంలో 2,368 మంది ఎమ్మెల్యే, 454 మంది ఎంపీ అభ్యర్థులు

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌ రేపు (సోమవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ (25), తెలంగాణ (17), ఉత్తరప్రదేశ్‌ (13), మహారాష్ట్ర (11), మధ్యప్రదేశ్‌ (8), పశ్చిమ బెంగాల్‌ (8), బీహార్‌ (5), జార్ఖండ్‌ (4), ఒరిస్సా (4), జమ్మూకాశ్మీర్‌ (1) లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌, ఒడిషాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు 2,368 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒడిషాలో 147 అసెంబ్లీ స్థానాలుండగా, నాలుగో దశలో 28 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. మిగిలిన 119 స్థానాలకు వచ్చే మూడు దశల్లో పోలింగ్‌ జరుగనుంది.
96 లోక్‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల బరిలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 పార్లమెంట్‌ స్థానాలకు గాను 454 మంది పోటీలో నిలిచారు. అలాగే, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గాను 525 మంది పోటీలో ఉన్నారు. బీహార్‌లో ఐదు పార్లమెంట్‌ స్థానాలకు 55 మంది, జమ్మూ కాశ్మీర్‌లో ఒక్క పార్లమెంట్‌ స్థానానికి 24 మంది, జార్ఖండ్‌లో నాలుగు పార్లమెంట్‌ స్థానాలకు 45 మంది, మధ్యప్రదేశ్‌లో ఎనిమిది స్థానాలకు 74 మంది, మహారాష్ట్రలో 11 పార్లమెంట్‌ స్థానాలకు 209 మంది, ఒరిస్సాలో నాలుగు పార్లమెంట్‌ స్థానాలకు 37 మంది, ఉత్తరప్రదేశ్‌లో 13 స్థానాలకు 130 మంది, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది పార్లమెంట్‌ స్థానాలకు 75 మంది పోటీ చేస్తున్నారు. అఖిలేష్‌ యాదవ్‌ (ఎస్పీ), గిరిరాజ్‌ సింగ్‌ (బిజెపి), అర్జున్‌ ముండా (బిజెపి), మహువా మొయిత్రా (తృణమూల్‌), యూసఫ్‌ పఠాన్‌ (తృణమూల్‌), శత్రుఘ్న సిన్హా (తృణమూల్‌), అధిర్‌ రంజాన్‌ చౌదరి (కాంగ్రెస్‌), అసదుద్దీన్‌ ఓవైసి (ఎంఐఎం), వైఎస్‌ షర్మిలా (కాంగ్రెస్‌) వంటి ముఖ్యలు పోటీ చేస్తున్నారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

➡️