రేపటి నుంచి సమ్మె ఉధృతం

Dec 30,2023 10:45 #Dharna, #muncipal workers
  • కార్మికులను రెచ్చగొట్టే విధానాలు ప్రభుత్వం మానుకోవాలి
  • మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మెను ఈ నెల 31 నుంచి ఉధృతం చేస్తామని, మంచినీరు, కరెంటుతో సహా మొత్తం సేవలు బంద్‌ చేస్తామని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రజలను తప్పుదారి పట్టించేలా కార్మికులను రెచ్చగొట్టే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సమ్మె పెద్దగా జరగడం లేదని, తక్కువ మంది కార్మికులే పాల్గొంటున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం సంఘాలతో చర్చలు జరిపిన తరువాత మాట్లాడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 105 మున్సిపాల్టీల్లో సమ్మె జరుగుతుందని, 30 వేల మంది కార్మికులు పాల్గొన్నారని తెలిపారు. సమ్మె ప్రభావాన్ని తక్కువ చేసి మాట్లాడటం కార్మికులను అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కవ్వింపు చర్యలు వెంటనే విడనాడాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లుగా అమలు చెయ్యకుండా మరలా ఎన్నికలకు సిద్ధపడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా, పుట్టపర్తి, ఒంగోలు, గుంటూరు జిల్లా తదితర చోట్ల పోటీ కార్మికులను తెచ్చి పోలీసుల అండతో పనిచేయించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న కార్మికులపై పోలీసులు దౌర్జన్యం చేసి సమ్మెను నీరుగార్చాలని చేస్తున్న కుట్రలను విరమించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చి కార్మిక హక్కులు కాపాడేందుకు కలిసి రావాలని సమ్మెకు దూరంగా ఉన్న సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సుమారు 50 వేల కుటుంబాలకు అన్యాయం జరగకుండా చూడటంలో తమ వంతు పాత్రను పోషించాలని కోరారు.

➡️