ఎన్నికల విధుల్లోని ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ : సిఇఒ ఎంకె మీనా

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో, విజయనగరం టౌన్‌ : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరాదని, స్పాట్‌లోనే ఫారమ్‌-12ను తీసుకోవడంతోపాటు అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కును కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్‌ఒలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం-12ను సకాలంలో సమర్పించలేకపోవడంతో తాము ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నట్లు ఉద్యోగులు ఇసి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏ ఉద్యోగి/ఓటరు ఓటు హక్కును తిరస్కరించరాదని పునరుద్ఘాటించారు. అనివార్య పరిస్థితుల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు మే ఒకటిన సమర్పించలేకపోతే ఎఆర్‌ఒ పరిధిలో ఆ ఉద్యోగి ఓటరుగా నమోదు అయ్యారో, ఆ ఆర్‌ఒకు ఫారమ్‌-12 సమర్పించేందుకు, ఆయా పెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలని సిఇఒ ఆదేశించారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ ఫెసిలిటేషన్‌్‌ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.

➡️