మళ్లీ మోసగించడానికే…

Apr 29,2024 08:53 #ap cm jagan, #speech

-టిడిపి, బిజెపి, జనసేనపై బహిరంగ సభల్లో సిఎం వైఎస్‌ జగన్‌ విమర్శ
ప్రజాశక్తి-యంత్రాంగం : మళ్లీ ముగ్గురూ జతకట్టి ప్రజలను మోసం చేయడానికి ముందుకొస్తున్నారని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, మోడీని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు మంచి జరగాలంటే బిజెపి, టిడిపి, జనసేన కూటమిని ఓడించాలని, వైసిపిని గెలిపించాలని కోరారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి, నెల్లూరు జిల్లా కందుకూరులో ఆదివారం జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. రైతుల, మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తామనే హామీతోపాటు అనేక హామీలను బిజెపి, జనసేన, టిడిపి కూటమి గతంలో ఇచ్చిందన్నారు. వాటిలో ఏ ఒక్క హామీనైనా ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు ఇవే పార్టీలు కూటమిగా ఏర్పడి సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవన్‌ అంటూ అనేక హామీలు ఇస్తూ ప్రజలను మళ్లీ మోసగించాలని చూస్తున్నాయని విమర్శించారు. తాము ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు అమలు చేశామని,. ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను చేర్చామని వివరించారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. సంక్షేమ పథకాలతో ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లను నేరుగా ప్రజలకు నగదు బదిలీ రూపంలో అందజేశామని తెలిపారు. వలంటీర్‌ వ్యవస్థ ఉండాలన్నా, సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా వైసిపిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. అవినీతి రహితంగా పరిపాలన సాగిందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనలో చెప్పుకోదగ్గ పథకం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. అమలుకు వీలుకాని హామీలతో చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ఆ శక్తులకు నచ్చడం లేదని దుయ్యబట్టారు.

➡️