ప్రగతి భవన్‌… ఇకనుంచి ప్రజాభవన్‌

  •  ఈ విజయం అమరవీరులకు అంకితం
  • ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత : రేవంత్‌రెడ్డి

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి క్యాప్‌ ఆఫీసు ప్రగతి భవన్‌ను ఇక నుంచి ప్రజాభవన్‌గా మారుస్తామని టిపిసిసి అధ్యక్షులు, ఎంపి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజాతీర్పును అమరులకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో గాంధీ భవన్‌కు వచ్చిన రేవంత్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, విహెచ్‌, విజయశాంతి తదితరులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. 2009 డిసెంబర్‌ 3న శ్రీకాంతచారి అమరుడయ్యారని గుర్తు చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చి శ్రీకాంతాచారికి ఘన నివాళులర్పించారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం అప్పగించి మాపై మరింత బాధ్యతను పెంచారని పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్‌ గాంధీ స్ఫూర్తిని నింపారని, ఆయన అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం సాధించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధస్తామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు హేతుబద్ధంగా వాదించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అవకాశమిస్తుందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి విపక్షాలతోపాటు అందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో సిపిఐ, జనసమితితోపాటు సిపిఎంను కూడా కలుపుకునిపోతామని, వారి సలహాలు తీసుకుంటామని ప్రకటించారు. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరిచే ఉంటాయన్నారు. కూటమి గెలుపునకు సహకరించిన సిపిఐకి, కోదండరాంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పును బిఆర్‌ఎస్‌ శిరసావహించాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు వారి వైపు నుంచి సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేసిన మంత్రి కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

➡️