వైసిపి, టిడిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : వైఎస్‌ షర్మిల

Mar 30,2024 15:23 #ap congress, #leader, #ys sharmila
  •  ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక

ప్రజాశక్తి-అమరావతి : వైసిపి, టిడిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కాంగ్రెస్‌ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని.. ప్రాంతీయ పార్టీల తరహాలో ఎంపిక జరగదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. వైసిపి, టిడిపి ప్రధాని మోడీకి బానిసలుగా మారాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా, పోలవరం.. ఏ విషయంలోనూ ఏపీకి న్యాయం జరగలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌ మూకుమ్మడి రాజీనామాలని చెప్పి డ్రామా చేశారని విమర్శించారు. 23 మంది వైసిపి ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదన్నారు. రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలను జగన్‌ తాకట్టు పెట్టారని విమర్శించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు

1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు
2. మహిళా వరలక్ష్మి పథకం పేరిట ప్రతి పేద మహిళకు నెలకు రూ.8,500
3. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
4. రైతులకు పెట్టుబడిపై 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర
5. ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400 అందజేత
6. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
8. ఇల్లు లేని ప్రతి పేద మహిళకు రూ.5 లక్షల పక్కా ఇల్లు
9. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పింఛను… ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ పింఛను

➡️