‘ఉక్కు’ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం

Apr 19,2024 21:55 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు రానున్న కాలంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, కార్మికులంతా కలిసి రావాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌ డి ఆదినారాయణ పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1163వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో డబ్ల్యుఎండి, యుటిలిటీస్‌, అడ్మిన్‌, టౌన్‌ అడ్మిన్‌, టిటిఐ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మించి విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి పోరాట కమిటీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. కార్మిక, ప్రజా సంఘాల ఐక్యతతో ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చేస్తామన్నారు. సొంత గనులు కేటాయించి, ప్లాంట్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తి జరపాలని డిమాండ్‌ చేశారు.

➡️