భూ హక్కు చట్టం రద్దు చేస్తాం

Jan 11,2024 08:06 #Chandrababu Naidu, #vijayanagaram

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి/కాకినాడ ప్రతినిధి : టిడిపి అధికారంలోకి వస్తే భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, విద్యుత్‌ ఛార్జీలు పెంచకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విజయనగరం, కాకినాడ జిల్లాల్లో బుధవారం నిర్వహించిన ‘రా కదలిరా’ సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. జగన్‌ పాలనపై ధ్వజమెత్తారు. అంగన్‌వాడీలు కడుపు మంటతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు ఊడదీస్తామంటూ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని అదే అంగన్‌వాడీలు ఎన్నికల్లో ఓడించడం ఖాయమన్నారు. టిడిపి హయాంలో సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు ఇచ్చామని గుర్తు చేశారు. అన్న క్యాంటీన్‌ ద్వారా రూ.5కే పేదలకు మూడు పూటలా అన్నం పెట్టామన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టారని విమర్శించారు. మద్యపాన నిషేధం అమలుచేయకపోగా.. టిడిపి అధికారంలో వస్తే ఐదేళ్లలో ఏటా 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐటి రంగంలో ఇంటి దగ్గర నుంచే పనిచేసే విధానం తీసుకొస్తామని, నియోజకవర్గాల్లో వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకొచ్చిన జగన్‌ నిరంతరం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోగా నిత్యావసర ధరలు పెరిగాయని తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌, మెగా డిఎస్‌సి ఏమైందని జగన్‌ను ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజాగా మారారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే అమరావతే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అన్న క్యాంటీన్లు మళ్లీ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చుతామని తెలిపారు.

➡️