కార్మికులు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

May 9,2024 22:50 #CITU, #press meet

సిఐటియు, ఎఐటియుసి పిలుపు
ప్రజాశక్తి- విజయవాడ :భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లౌకికతత్వం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఇండియా వేదిక పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ హామీ ఇచ్చాయని, ఈ నేపథ్యంలో ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కార్మిక వర్గం ఇండియా వేదిక అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు కోరారు. ఇండియా వేదిక పార్టీలను గెలిపించాల్సిన చారిత్రక అవసరం, బాధ్యత కార్మికులపై ఉందన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ప్రధాన కార్మిక సంఘాల నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని పదేళ్ల బిజెపి పాలనలో దేశ ఐక్యతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. బడా కార్పొరేట్లను భుజానికెత్తుకున్నారని విమర్శించారు. నిరుద్యోగం పెరిగిందని, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జతకట్టాయని, వైసిపి పరోక్షంగా మద్దతు ఇస్తోందని వివరించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు వంటి ఏ ఒక్కటీ అమలు కాలేదని తెలిపారు. కేంద్రంలోని మోడీ/బిజెపి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలను టిడిపి, జనసేన, వైసిపి తాకట్టు పెట్టాయని విమర్శించారు. బిజెపికి, ఆ పార్టీతో అంటకాగుతున్న పార్టీలకు కార్మికులు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర నాయకులు పి.అజరుకుమార్‌, డి.రమాదేవి పాల్గొన్నారు.

➡️